KishanReddy Fires on Government Lands sale in Telangana : రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విషయంలో.. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓట్లకు కావాల్సిన నిధుల కోసం భూములను అమ్ముతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ భూములను అమ్మడం ప్రజా వ్యతిరేక చర్య అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే అసైన్డ్ ల్యాండ్స్‌ను కూడా అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. సంపద సృష్టించాలి తప్ప.. కొల్లగొట్టకూడదని హితవు పలికారు. రాష్ట్ర సర్కార్ అసమర్థత కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోతున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ తన హయాంలో సుమారు రూ.6లక్షల కోట్లు అప్పు చేశారని.. ఏ రాష్ట్రం ఇంత అప్పు చేయలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. భూములను అమ్మడం ద్వారా రూ.7,000 కోట్లు ఆర్జించిన ప్రభుత్వం.. ఉన్న భూమినంతా అమ్మాలని చూస్తుందా అని ప్రశ్నించారు. లేక డబ్బులతో ఓటర్లను మభ్య పెట్టాలని చూస్తోందా అని నిలదీశారు. ఈ క్రమంలోనే కోకాపేటలో బీఆర్ఎస్ 11 ఎకరాలు.. కాంగ్రెస్ 10 ఎకరాల భూమిని కార్యాలయాల కోసం పంచుకున్నారని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.
Kishan Reddy on Hyderabad Floods : 'హైదరాబాద్‌ను ఇస్తాంబుల్, వాషింగ్టన్ చేస్తానన్నారు.. ఇదేనా?'
రాజకీయ పార్టీకి భూమి ఇస్తారు కానీ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు, సైన్స్ సిటీకి, పేదవారి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి.. భూములివ్వరని కిషన్‌రెడ్డి విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే వీటిని రద్దు చేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి జయసుధ సహా పలువురు నాయకులు ఆకుల రాజేందర్, రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, జైపాల్‌రెడ్డిలను కిషన్‌రెడ్డి సన్మానించారు.
"ప్రభుత్వ భూముల విషయంలో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఇల్లు పీకి పందిరి వేసినట్లుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఓట్లకు కావాల్సిన నిధుల కోసం భూములను అమ్ముతున్నారు. ప్రభుత్వ భూములను అమ్మడం ప్రజా వ్యతిరేక చర్య.. అసైన్డ్ భూములను కూడా అమ్మేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. సంపద సృష్టించాలి తప్ప కొల్లగొట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేకపొతున్నారు. సుమారు రూ.6 లక్షల కోట్లు అప్పు చేశారు. ఏ రాష్ట్రం ఇంత అప్పు చేయలేదు. కోకాపేట్లో బీఆర్‌ఎస్ 11 ఎకరాలు, కాంగ్రెస్ 10ఎకరాల భూమిని కార్యాలయాల కోసం పంచుకున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ భూములను రద్దు చేస్తాం." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు