Kishan Reddy Counter on Rahul Comments : అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ఎంతో ప్రమాదకరమని మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి చెబుతూ ఉండేవారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఉపన్యాసం విని.. ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఖమ్మం సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదని రాహుల్ గాంధీ అన్నారని.. కానీ నాలుగు నెలలు ఆగితే తెలంగాణ ప్రజలే తేలుస్తారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే రాహుల్ గాంధీపై నమ్మకం లేక 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ గూటికి చేరిపోయారని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని యువరాజు.. పగటి కలలు కని ఊహా లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Kishan Reddy Fires On Rahul Gandhi : బీజేపీ బీ టీం అనడం అంటే.. మిడిమిడి జ్ఞానంతో అవగాహన లేమితో మాట్లాడటమేనని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి చురకలు అంటించారు. కేసీఆర్ కాంగ్రెస్‌లోనే నాయకుడిగా ఎదిగాడని.. ఇద్దరి డీఎన్‌ఏ ఒకటే.. రెండూ కుటుంబ పార్టీలేనని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ తమకు ఎంత దూరమో.. బీఆర్‌ఎస్ కూడా అంతే దూరమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో ఎప్పుడూ కలిసి పని చేయలేదని.. భవిష్యత్తులోనూ కలిసి పని చేసే అవకాశమే లేదని వెల్లడించారు. అలాగే మజ్లిస్‌ను పెంచి పోషించిన ఘన చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్‌దని.. ఊరేగిస్తున్న చరిత్ర బీఆర్‌ఎస్‌దని దుయ్యబట్టారు.
"బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడుగా ఉండలేనని పారిపోయిన వ్యక్తి. బీజేపీపై విమర్శలు చేసే నైతిక హక్కు ఉందా. బీజేపీ కాంగ్రెస్‌కు ఎంత దూరమో.. బీఆర్‌ఎస్‌కు కూడా అంతే దూరం. బీఆర్‌ఎస్‌తో భవిష్యత్తులో కూడా కలిసి పని చేయము." -కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
Kishan Reddy Reacts On Rahul Gandhi : గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగలేనంటూ పారిపోయిన వ్యక్తి రాహుల్ అని.. అధ్యక్షుడిగా ఘోరంగా విఫలమైన వ్యక్తికి బీజేపీని విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. గత నెలలో విపక్షాల సమావేశంలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్.. ఇప్పుడు కేసీఆర్‌ను కలవడంతోనే వాళ్ల బంధమేంటో అర్థమవుతోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే నిన్నటి సభలో రాహుల్ గాంధీ కుటుంబ రాజకీయాలపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు.. వారి కుటుంబ పెద్దల అండదండలతోనే కాదా అని ప్రశ్నించారు. అధికారం కోసం దేనికైనా దిగజారే పార్టీ కాంగ్రెస్ అని ఆరోపణలు చేశారు. ప్రధాని పదవిని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే కాంగ్రెస్ పార్టీకి.. బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే నాణానికి ఉన్న బొమ్మా బొరుసు లాంటివని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి :