Kishan Reddy Reaction on BRS Manifesto : బీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడంలో భాగంగా కేసీఆర్ మరో మేనిఫెస్టోను ప్రకటించారని విమర్శించారు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టోల్లోని హామీలను అమలు చేయకుండా కేసీఆర్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని.. వందల హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన నయ వంచకుడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Kishan Reddy on BJP MLA Candidates List 2023 : 'ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం మా స్ట్రాటజీ'
ఈ సందర్భంగా కేసీఆర్.. చిత్తశుద్ధి లేని ఎన్నికల హామీలు ఇచ్చారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో సంపద పెంచకుండా.. అప్పులు, అవినీతి, అక్రమాలు పెంచారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను దోచుకున్నారని.. డేంజర్ పవర్ పాలసీని కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సకల జనుల ద్రోహి అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల చెవిలో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం జరుగుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్య ఏమైందని ప్రశ్నించిన ఆయన.. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేసినట్లైతే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్పితే.. ప్రగతి భవన్ దాటడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 80 వేల పుస్తకాలు చదువుకున్న మేధస్సుతో కేసీఆర్ తెలంగాణను భ్రష్టు పట్టించారని ఆక్షేపించారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్.. 90 లక్షల మందికి ఇస్తామంటే ప్రజలెవరూ నమ్మరన్నారు.
మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కేసీఆర్ నైజం. కాంగ్రెస్ కూడా ఇచ్చిన హామీలను ఎప్పుడూ నెరవేర్చలేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలి. కేజీ టు పీజీ విద్య ఏమైందో కేసీఆర్ చెప్పాలి. రేషన్ కార్డు ఇవ్వని సర్కారు.. సన్న బియ్యం ఇస్తామనటం హాస్యాస్పదం. 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్.. 90 లక్షల మందికి ఇస్తామంటే ప్రజలెవరూ నమ్మరు. తెలంగాణ ప్రజల చెవిలో గులాబీ పూలు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. - జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
BJP On Unemployment in Telangana : 'కేసీఆర్ సర్కార్ విఫలమైంది.. తెలంగాణలో విప్లవం మొదలైంది'
అమలు కాని హామీలిచ్చారు..: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటించి.. కేసీఆర్ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ ఆరోపించారు. అమలు కాని హామీలను ఇచ్చారని విమర్శించారు. 2014, 18 ఎన్నికల మేనిఫెస్టోల్లో పొందుపరిచిన హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన ఆయన.. అమలు చేయని హామీలు ఎన్ని ఇచ్చినా వృథానే అన్నారు. కౌలు రైతుల ఊసే లేదని.. కేసీఆర్ మహిళల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డూ ఇవ్వలేదన్న లక్ష్మణ్.. దేశంలో రేషన్ కార్డు ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రేషన్ కార్డు ఇవ్వకుండా సన్న బియ్యం ఇస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. కేసీఆర్ ఎన్ని రంగురంగుల సినిమాలు చూపించినా తెలంగాణ ప్రజలు మోసపోరని లక్ష్మణ్ స్పష్టం చేశారు.