Kishan Reddy on Railway Projects in Telangana : కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు (Kishan Reddy on Projects) కేటాయించినా.. తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని.. రాష్ట్రంలో రైల్వే చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు మినహా.. మైదాన ప్రాంతంలో అతి తక్కువ నెట్‌వర్క్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Kishan Reddy Fires on Telangana Government : గతంలో పాలించిన కాంగ్రెస్ హయాంలో కానీ.. బీఆర్ఎస్ పాలనలో కానీ.. తెలంగాణాలో రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలేవీ జరగలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరైన ప్రాజెక్టులకు కూడా.. కనీసం భూసేకరణ చేయడం లేదని మండిపడ్డారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ కోసం అదనపు భూమి అడిగితే.. తెలంగాణ సర్కార్ స్పందించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Kishan Reddy Khammam District Tour : 'కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూశాం.. బీజేపీకి అవకాశం ఇవ్వండి'
ఈ క్రమంలోనే చర్లపల్లి టర్మినల్‌కు కనెక్టివిటీ రోడ్ కోసం.. భూమి అడిగితే పట్టించుకోవడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్‌కు కావాల్సిన 50 శాతం భూసేకరణ చేసేందుకు ముందుకు రాకపోవడంతో.. అది ముందుకు సాగడం లేదన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆనుకుని.. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు 564 కిలోమీటర్లకు.. రూ.12,408 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న ప్రాజెక్టు పట్టా లెక్కడం లేదని కిషన్‌రెడ్డి వివరించారు.
Kishan Reddy on MMTS : ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌లో 40 కిలోమీటర్ల వరకు.. రూ.908 కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రితో అనుసంధానం కానున్న ప్రాజెక్ట్‌కు.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం వల్ల అది ఆలస్యమవుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే చర్లపల్లి టర్మినల్‌ను 2024లో ప్రారంభిస్తామని చెప్పారు. సికింద్రాబాద్ - బెంగళూర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభమవుతుందని వివరించారు. 2022లో తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల.. 1,300ల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు నిలిచిపోయాయని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం సంప్రదింపులు జరపడం వల్ల.. తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చాలా ప్రాజెక్టులకు.. కేంద్రం పచ్చ జెండా ఊపిందని కిషన్‌రెడ్డి తెలిపారు. దాదాపు 15 కొత్త ప్రాజెక్టుల ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్.ఎల్.ఎస్)కు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. వీటితో పాటు 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ (నాలుగు లేన్ల)కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని కిషన్‌రెడ్డి వివరించారు.
ఈ మొత్తం ప్రాజెక్టులకు ఎఫ్ఎల్‌ఎల్ మంజూరైందని, ఇవి పూర్తవగానే డీపీఆర్‌లు సిద్ధమవుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. 15 కొత్త ప్రాజెక్టులు, 15 అదనపు లైన్ల ప్రాజెక్టులు కలిపి.. మొత్తం 30 ప్రాజెక్టులు సిద్ధం కానున్నాయని పేర్కొన్నారు. వీటి విలువ అక్షరాల రూ.83,543 కోట్లు ఉంటుందన్నారు. 2004-14 మధ్య తెలంగాణకు.. 5 ప్రాజెక్టులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఇందులో 714 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం కేటాయించిన మొత్తం రూ.10,192 కోట్లు కేటాయించిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
కానీ బీజేపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలోనే 30 ప్రాజెక్టులను.. 5,239 కిలోమీటర్ల పరిధిలో కొత్త లైన్లు, అదనపు లైన్ల ప్రాజెక్టుల కోసం కేటాయించిన మొత్తం విలువ రూ.83,543 కోట్ల వరకు ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్రం.. రాష్ట్రం కోసం సర్వే చేసిన కొన్ని ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలియజేశారు.
- ఆదిలాబాద్ - నిర్మల్ - పటాన్‌చెరు.. 317కిలోమీటర్ల ప్రాజెక్టుకి.. రూ.5,706 కోట్ల అంచనా వ్యయం
- డోర్నకల్ - గద్వాల్.. 296 కిలోమీటర్ల ప్రాజెక్టుకు.. రూ.5,328 కోట్ల అంచనా వ్యయం,
- కాచిగూడ - ఉందానగర్- జగ్గయ్యపేట.. 228 కిలోమీటర్ల ప్రాజెక్టుకు.. రూ.4,104 కోట్ల అంచనా వ్యయం,
- కరీంనగర్ - హసన్‌పర్తి.. 62 కిిలోమీటర్ల ప్రాజెక్టుకు.. రూ.1,116 కోట్ల అంచనా వ్యయం
- భూపాలపల్లి - కాజీపేట కొత్త లైన్.. 64 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.1,152 కోట్ల అంచనా వ్యయంతో రూపొందిస్తుందన్నారు. ఇది సమ్మక్క - సారక్క భక్తులకు ఉపయోగపడుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
"కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్రప్రభుత్వం సహకరించాలి. మంజూరైన ప్రాజెక్టుల భూసేకరణకు సహకరించాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌కు భూమి అడిగాం. భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు