BJP Highcommand focus on Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర బీజేపీలో పలు మార్పులు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్‌రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ప్రకటించింది. అదేవిధంగా.. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఖరారు చేసింది.
Bjp activists grand welcome to Kishanreddy : ఈ క్రమంలో దిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అలాగే కిషన్‌రెడ్డిని కలవడానికి ఈటల రాజేందర్ విమానాశ్రయానికి వెళ్లారు. అభిమానుల కేరింతలు, నినాదాల నడుమ ర్యాలీగా కిషన్‌రెడ్డి కొంతదూరం వెళ్లారు. అంతకుముందు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన కిషన్‌రెడ్డి.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అందరితో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.
పార్టీ గుర్తించి తనకు ఇచ్చిన అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. ఫలానా కావాలని పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈనెల 8వ తేదీన మోదీ వరంగల్ వస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని పర్యటనలో భాగంగా.. రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. 150ఎకరాల విస్తీర్ణంలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.
అధ్యక్షుడి హోదాలో కిషన్‌రెడ్డి తొలి సమావేశం: దిల్లీ నుంచి వచ్చిన కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తొలి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ వరంగల్ పర్యటన ఏర్పాట్లపై నేతలతో కలిసి చర్చించారు. ముఖ్యంగా వరంగల్‌లో జులై 8న జరిగే ప్రధాని సభకు జన సమీకరణ కోసం తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. అదేవిధంగా నియోజకవర్గాల వారిగా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి జన సమీకరణ లక్ష్యంగా అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. నియమించిన వారు రేపు ఉదయమే ఆయా నియోజక వర్గాలకు వెళ్లాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్, డీకే.అరుణ, ఈటల, ఎంపీ అర్వింద్, జితేందర్‌రెడ్డి, విజయశాంతి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: