Kishan Reddy Fires on Telangana Government: కార్మికుల కష్టార్జితంతో కొనసాగుతున్న సింగరేణి సంస్థను.. రాష్ట్ర ప్రభుత్వం భక్షించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబం, బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలకు.. తెలంగాణ బంగారు గని బలైపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి అప్పులు రూ.10,000 కోట్లకు పెరిగాయని చెప్పారు. కార్మికులపై పని భారం విపరీతంగా పెంచేశారని అన్నారు. దిల్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉంది: సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అందులోని కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ నేతలు భక్షిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బొగ్గు గనుల వేలంలో ప్రభుత్వం పాల్గొనట్లేదని విమర్శించారు. టెండర్లు కూడా వేయకుండా బాధ్యత విస్మరించారని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల దృష్ట్యా కొత్త పల్లవి అందుకున్నారని.. ప్రధానికి వ్యతిరేకంగా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
అలా చేస్తే కార్మికులు ఊరుకోరు: ఈ క్రమంలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కొంటామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. విశాఖ కార్మికుల పాలిట దేవుళ్లమని గొప్పలు చెబుతున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం రాజకీయ జిమ్మిక్కులు చేస్తోందని విమర్శించారు. సింగరేణి సొమ్మును.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెడితే కార్మికులు ఊరుకోరని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"సింగరేణిలో విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయి. సీఎం కుటుంబం, బీఆర్ఎస్ నేతల జోక్యం పెరిగిపోయింది. సింగరేణి అప్పులు రూ.10 వేల కోట్లకు పెరిగింది. కార్మికులపై పని భారం విపరీతంగా పెంచేశారు. సింగరేణిని కార్మికుల కష్టాన్ని బీఆర్ఎస్ నాయకులు భక్షిస్తున్నారు. సింగరేణి సొమ్ము విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెడితే కార్మికులు ఊరుకోరు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
అసలేం జరిగిదంటే: కొద్ది రోజుల నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించకుండా సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఉక్కు పరిశ్రమ విషయంలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి అధికారులు విశాఖలో పర్యటించారు. ఉక్కుపరిశ్రమ బిడ్‌పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు.
ఇవీ చదవండి: KTR: 'విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రకటన కేవలం దృష్టి మరల్చే చర్య'
BRS Meeting in Maharashtra: బీఆర్ఎస్కు మహారాష్ట్ర పోలీసులు షాక్.. బహిరంగ సభకు 'నో పర్మిషన్'
Post Card war: ఆగని పోస్ట్‌కార్డు యుద్ధం.. 2 లక్షల ఉత్తరాలతో ప్రధానికి మనవి
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై మాతృభాషలోనూ పరీక్షలు.. ఇంగ్లిష్ మీడియం అయినా..