Kishan Reddy fire on Telangana govt: గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నేరుగా సర్పంచ్‌ల ఖాతాల్లో జమ చేసిన నిధులను.. రాష్ట్ర సర్కార్ గద్దల్లా దారిమళ్లించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ 'కీ'ని దుర్వినియోగం చేసి.. సర్పంచ్లకు తెలియకుండా నిధులను దారిమళ్లించాయని.. ఇంతకంటే దిగజారుడు తనం ఉందా అని ఎద్దేవా చేశారు.
ఈ నిధులను తెలంగాణ రాష్ట్రేతర ప్రజలకు ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది.. తెలంగాణ ప్రజల మౌలిక సదుపాయాల కోసం ఇచ్చిన నిధులను వెంటనే ఖాతాల్లో నుంచి తీసి ఖర్చు చేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు. సర్పంచ్లకు తెలియకుండా, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లను సమావేశపరచకుండా ఆ డబ్బులను తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పేద ప్రజలకు ఉపాధి నిర్వాహణకు కేంద్రం ఆ నిధులను మంజూరు చేసిందని తెలిపారు.
గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని.. దీనివల్ల పేద ప్రజలకు ఉపాధి కరవు అయ్యిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దొంగతనంగా తీసుకుంటే నిరసన వ్యక్తం చేసే అర్హత సర్పంచ్లకు లేకుండా పోలీసులతో నిర్బంధించి చర్యలు తీసుకున్నారన్నారు. న్యాయస్థానానికి వెళ్లి సర్పంచ్లు నిరసన వ్యక్తం చేసుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. సీఎం కేసీఆర్ వైఖరి ఈ విధంగానే ఉన్నట్లు అయితే రానున్న రోజుల్లో తెలంగాణలో ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కల్వకుంట్ల కుటుంబం రాజ్యాంగం తెలంగాణలో కొనసాగితే రాష్ట్రం దివాలా తీసిన ఆశ్చర్యపోవలసిన పనిలేదని.. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు.
"గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు లేకుండా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న భావంతో.. నరేంద్రమోదీ ప్రభుత్వం నేరుగా సర్పంచ్‌ల ఖాతా(గ్రామ పంచాయతీ)ల్లోకి డబ్బులను నేరుగా జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తున్నారు. ఇటీవల సుమారు రూ.5080కోట్లను తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇటీవలనే నిధులు విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను గంటసేపులోనే దారి మళ్లించారు. ఇంతకంటే నీచమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఇవీ చదవండి: