Kishan Reddy Counter To Rahul Gandhi Statement : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రోజురోజుకు నాయకుల మధ్య విమర్శలు చెలరేగిపోతున్నాయి. ఇతర పార్టీ మైనస్‌లు చూపిస్తూ.. ప్రజలను తమవైవు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ బస్సు యాత్రలో (Congress Bus Yatra) భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఏవి బీ పార్టీగా ఉన్నాయో తెలుసని వ్యంగ్యంగా మాట్లాడారు. కాగా ఈ మధ్య కాలంలో పార్టీలకు బీ పార్టీలంటూ రాజకీయనేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Kishan Reddy Fires on Rahul Gandhi : హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీం అంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తానన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నదా.. లేదా అంటూ నిలదీసిన ఆయన.. రేవంత్‌పై ఉన్న ఈ కేసుపై దర్యాప్తు ఎందుకు జరగడం లేదని అన్నారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పినా.. ఎందుకు చేయడం లేదంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారో రాహుల్‌గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Kishan Reddy Fires on BRS : "బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. యువత నిశ్శబ్ధయుద్దం చేస్తోంది"
Kishan Reddy Latest Comments : రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు మధ్యవర్తిగా మజ్లిస్ పార్టీని పెట్టుకున్నాయని ఆరోపించారు. మజ్లిస్ పార్టీని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీజేపీకి రాకుండా చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాజకీయ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. ఈ మూడు పార్టీల డీఎన్‌ఏలు ఒక్కటే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని తెలిపారు. ఎవరికి ఎవరు బీ టీమ్ అనే అంశంపై చర్చకు రావాలని రాహుల్‌గాంధీకి సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అయినా సరే.. దిల్లీ ప్రెస్‌క్లబ్ అయినా సరే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. తేదీ, సమయం స్థలం మీరు నిర్ణయిస్తే చర్చకు వచ్చేందుకు తాము సిధ్దమన్నారు. రాహుల్‌గాంధీ రాజకీయ అవగాహన లేకుండా రాసిచ్చిన కాగితాలు చదువుతున్నారని ఎద్దేవా చేశారు.