Kishan Reddy Comments on Dharani Portal : ధరణి పోర్టల్ వల్ల రైతులు వేధింపులకు గురవుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. భూములపై హక్కులు కోల్పోయి.. అన్నదాతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వివరించారు. ఈ క్రమంలోనే న్యాయం చేస్తామంటూ మళ్లీ బీఆర్ఎస్ నేతలే దళారులుగా మారారని విమర్శించారు. హైదరబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ధరణి పోర్టల్ వల్ల కొత్త భూ సమస్యలు వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే దాదాపు 10 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పాసుపుస్తకాల్లోని తప్పుల సవరణకు కూడా అవకాశం లేదని వివరించారు. ఒకప్పుడు గ్రామస్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు నేడు ప్రగతిభవన్‌కు వెళ్తున్నాయని ఆరోపించారు. ధరణి పోర్టల్ వచ్చింది ప్రజల కోసం కాదని.. బీఆర్ఎస్ నేతల కోసమని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారు : పేదల భూములను అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దళారీ వ్యవస్థను పెంచి పోషించేలా ధరణి విధానం ఉందనే విషయాన్ని.. గతంలో కోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు. కొన్నేళ్ల క్రితం అమ్ముకున్న భూములు ఇప్పుడు భూస్వాముల పేర్లతో ధరణిలోకి వచ్చాయని వివరించారు. రైతులు పెట్టుకున్న దరఖాస్తులను అధికారులు ఎందుకు పరిష్కరించట్లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న భూములను కూడా అనేక రకాలుగా కబ్జా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
సచివాలయం ఎవరి కోసం కట్టారు? : ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ చేతిలో బందీ అయిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ నేతలను తీసుకువచ్చి సచివాలయం చూపిస్తున్నారని తెలిపారు. కానీ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. సచివాలయం ఎవరి కోసం కట్టారని ప్రశ్నించారు. ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వం అప్రమత్తతో ఉండాలని.. వీటిని ఉక్కుపాదంతో అణిచివేయాలని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"ధరణి పోర్టల్ వల్ల రైతులు వేధింపులకు గురవుతున్నారు. లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. భూములపై హక్కులు కోల్పోయి.. రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయం చేస్తామంటూ మళ్లీ బీఆర్ఎస్ నేతలే దళారులుగా మారారు. ధరణి పోర్టల్ వల్ల కొత్త భూ సమస్యలు వచ్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి." - కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి: Dharmapuri Arvind fires BRS : తడిసిన ధాన్యం కొనుగోలులో.. రాష్ట్ర ప్రభుత్వం విఫలం
'మెజారిటీ లేకున్నా అధికారం.. బీజేపీ ప్లాన్-బీ రెడీ!'.. జేడీఎస్ కలిసేది వారితోనే!!
కౌంటింగ్‌కు రంగం సిద్ధం.. కన్నడనాట గెలుపెవరిది? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?