Kishan Reddy in hunar haat :భారతదేశం గొప్ప కళాసంపదకు నిలయమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి కళాకారుడిని ప్రోత్సహించాల్సిన బాధ్యత దేశంపై ఉందన్న కిషన్ రెడ్డి... ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శనను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 6 వరకు కొనసాగే ఈ హునర్ హాట్ ప్రదర్శనను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్న కిషన్ రెడ్డి... ప్రధానమంత్రి అనుమతితో తన నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం పట్ల మంత్రి అబ్బాస్ నఖ్వీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కళాకృతుల ప్రదర్శన
హునర్ హాట్‌లో 30 రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారని, హైదరాబాద్ నగరవాసులు తప్పకుండా హునర్ హాట్ను సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని కిషన్ రెడ్డి కోరారు. హునర్ హాట్లోని పలు రాష్ట్రాల కళాకారులతో మాట్లాడి... వాళ్లు తయారుచేసిన కళాకృతులను పరిశీలించారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్లో మూడు రోజులపాటు ఎన్టీఆర్ స్డేడియంలోనే పెద్ద ఎత్తున అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ హాజరై చేతివృత్తి కళాకారులను అభినందించారు.
'హునర్ హాట్‌లో భారతదేశ ఐక్యత కనిపిస్తోంది. కొందరు లక్నో నుంచి వచ్చారు. మరికొందరు భోపాల్ నుంచి వచ్చారు. ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఎంతోమంది కళాకారులు ఉన్నారు. కరోనా కారణంగా చిన్నచిన్న పనులు చేసుకునేవారు, శిల్పకారులు, కళాకారులు ఎంతోమంది ప్రభావితం అయ్యారు. రెండేళ్లుగా వారు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ జరగలేదు. ఇందుకోసమే మైనార్టీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 75 చోట్ల హునర్ హాట్ ప్రదర్శన ఏర్పాటు చేశారు.'
-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
'హునర్ హాట్ కార్యక్రమం వెనుక ఓ ఆలోచన, సంకల్పం ఉన్నాయి. ఇది శిల్పకారులు, చేతివృత్తిదారుల, కళాకారుల వారసత్వ కళలకు మార్కెటింగ్ కల్పించడం ప్రధాన ఉద్దేశం. మరోవైపు స్వదేశీ కళల స్వావలంబన సాధించేందుకు ఇది ఒక ప్రభావవంతమైన కార్యక్రమం. శిల్పకారులు, కళాకారులు, చేతివృత్తిదారుల సంరక్షణ, ప్రోత్సాహానికి హునర్ హట్ భాగస్వామ్యం అవుతుంది.'
-ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్రమంత్రి
ఇదీ చదవండి: Alcohol consumption effects on health : సరదాగా మొదలై.. వ్యసనమై వేధిస్తుంది..!