ఇండియాజాయ్ వంటి అంతర్జాతీయ వేదిక. దేశవిదేశాల నుంచి వందలాది మంది ఔత్సాహికులు, అతిథులు... ఈ వేడుకలో విభిన్న ఆలోచనలను పంచుకుంటున్నారు. అందరినీ ఆకట్టుకునే గేమింగ్‌లో దేశవిదేశీ ఔత్సాహికులు... జీటీఏ, లూడో, యూనిటీ వంటి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన గేమ్స్ ప్రదర్శించారు. అయితే... వీటన్నింటిలోనూ పిల్లలు రూపొందించిన ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినూత్న ఆలోచనలతో... సాంకేతికత సాయంతో సొంతంగా తయారుచేసిన గేమ్స్ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. సందర్శకులను అలరించాయి.
ఆన్‌లైన్ ఆటలను రూపొందించిన చిన్నారులు
గురుగ్రామ్, చెన్నై, బెంగళూరు.... ఇలా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన పిల్లలు ఈ ఆన్‌లైన్ ఆటలను రూపొందించారు. పాఠ్యపుస్తకాల విజ్ఞానానికే పరిమితం కాకుండా.. తమలోని సృజన చాటుకున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికత సాయంతో.. ఉన్న వనరులను వినియోగించుకుని గేమ్స్ రూపొందించారు. సైన్స్, మ్యాథ్స్, టెక్నాలజీ, స్పేస్ వంటి అంశాలను వారు తయారు చేసిన ఆటల్లో మేళవించారు. ఇండియా జాయ్ మూడో రోజు వేడుకలో ఈ చిన్నారుల ప్రయత్నమే ప్రత్యేకంగా నిలిచింది.
చంద్రయాన్2 ఆదర్శం
బడిలో ఇచ్చిన హోంవర్కులు పూర్తి చేసే వయసు వారిది. అయితే ఈ చిన్నారులు అంతటితో ఆగిపోలేదు. ఆలోచనలకు పదును పెడుతూ..... ఏదో చేయాలని కంప్యూటర్ ముందు కూర్చుని గేమ్స్ రూపొందించారు. ఈ చిచ్చరపిడుగుల్లో కొందరికి.... కొన్ని నెలల కిందట ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఆదర్శమంటే నమ్మగలమా..? సమాజంలో మనం నిత్యం చూసే అంశాల స్ఫూర్తితో గేమ్స్ రూపొందించారంటే.. ఆశ్చర్యం కలగకుండా ఉంటుందా..? వీరి మాటలు ఒకసారి వింటే... ఈ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి.
భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు
అధునాతన సాంకేతికత, సాఫ్ట్‌వేర్ల సాయంతో డిజిటల్ గేమ్స్ రూపొందించిన ఈ చిన్నారులు... భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అంటున్నారు. డిజిటల్ విప్లవంతో ఎంతోమందికి చేరువవుతున్న ఈ ఆన్‌లైన్ గేమ్స్ రంగంలో... తమ ప్రయోగాలకూ స్థానం ఉంటుందని ఆశిస్తున్నారు.
ఇలా... ఆటల ఊహలకు రూపం కల్పించిన ఈ చిన్నారులు.... భవిష్యత్తులోనూ గేమింగ్ రంగంలో తమదైన ముద్రవేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ఇవీ చూడండి: ప్రపంచ సినిమాకు వేదిక హైదరాబాద్: కేటీఆర్