ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చేస్తున్న కంది, పెసర, మినుప వంటి పప్పుధాన్యాల సహజీవన మొక్కల అధ్యయనంలో కీలక పురోగతి లభించింది. మూడేళ్లుగా లండన్‌కు చెందిన రెండు బృందాలతో హెచ్‌సీయూ మాజీ వీసీ, మొక్కల శాస్త్రం విభాగం ఫ్రొఫెసర్ అప్పారావు నేతృత్వంలోని బృందం కంది మొక్కపై దేశంలోని వివిధ రకాల నేలలపై పరిశోధనలు చేశారు.
తగిన నైట్రోజన్ ఉన్నపుడే..
కంది మొక్కకు నత్రజని అందించే బ్రాడిరైజోబియం మొక్క వేరుబోడుపుల్లో చేరక ముందే వేరే రైజోబియం అందులో చేరుతుందని గుర్తించారు. దీనివల్ల కందిమొక్కకు అవసరమైన నత్రజని అందక కందిలో ఉండాల్సినంత నైట్రోజన్ ఉండటం లేదని తేల్చారు. పప్పుధాన్యాల పంటలకు వేర్వేరు రైజోబియంల అవసరం ఉంటుందని... మొక్కను బట్టి సరైన రైజోబియంను వేరుబొడుపుల్లో త్వరగా చేరేలా చేయగలిగితే ఆ మొక్కకు తగినంత నత్రజని అందుతుందని హెచ్‌సీయూ తెలిపింది.
ఎరువుగా పప్పుధాన్యాల మొక్కలను దుక్కిలో మార్చేందుకు.. ఆ మొక్కలో తగినంత నత్రజని ఉన్నప్పుడే ప్రయోజనం ఉంటుందని ఫ్రొఫెసర్ అప్పారావు స్పష్టం చేశారు. తాజా పరిశోధనతో భారతదేశంలోని నేలల్లో పండే పప్పుధాన్యాల మొక్కల్లో నత్రజని సామర్థ్యం పెంచే సరైన రైజోబియం గుర్తించడంతో పాటు వేరుబొడుపుల్లో దాన్ని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగుమం అయిందని తెలిపారు.
ఇదీ చూడండి: 'తెలుగువారికి ఉపకారం చేయాలని ఉంది'