రాజ్యాంగం, చట్టం అందరికీ సమానమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెరాస సెక్యులర్ పార్టీ అని, ఏ అంశాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతామని తెలిపారు. సీఏఏ చట్టంతో దేశ ప్రతిష్ఠ అప్రతిష్ఠ పాలైందన్నారు. సీఏఏ అమలును సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని కొట్టివేయాలని కోరారు.
అసెంబ్లీలో తీర్మానం చేస్తాం...
బడ్జెట్ సెషన్‌లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీకి నిర్ణయాన్ని తెలిపే అవకాశం తమకు ఉందన్నారు. భారత్ మత దేశంగా ఉండకూడదని అభిప్రాయ పడ్డారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే... నిర్ణయాలను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించారు.
మతతత్వ పార్టీల వైఖరి వల్లే భైంసాలో అల్లర్లు...
భైంసాలో జరిగిన ఘటనను సహించలేదని సీఎం తెలిపారు. భైంసాకు బలగాలను పంపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని చెప్పారు. పోలీసులు తీసుకున్న చర్యల వల్లే భైంసాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.
ఉద్రేకాలు రెచ్చగొట్టడం సరికాదు...
క్షీణించిపోతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించకుండా ఉద్రేకాలు రెచ్చగొట్టడం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. వేల సంవత్సరాల క్రితం నుంచి మనదేశానికి ఎందరో యాత్రికులు వస్తున్నారని, వారిని వెళ్లగొట్టాలని అనుకోవడం సరికాదన్నారు. విదేశాల్లో ఉన్న మనవారిని ఇతర దేశాలు వెళ్లగొడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అందరినీ సంఘటితం చేసి, దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని కేసీఆర్ చెప్పారు.
ఇదీ చూడండి: బస్తీకా బాద్షా: పట్టణాల్లో గులాబీ పార్టీకి పట్టం..