రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను వంద శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వంద శాతం అక్షరాస్యతే ధ్యేయంగా ప్రజలు ప్రతిన తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అగ్రగామిగా తెలంగాణ
ప్రతి ఒక్కరూ మరొకరికి బోధించాలన్న నినాదాన్ని అందుకుని ప్రతి ఒక్క చదువుకున్న విద్యావంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా మార్చాలని కోరారు. స్వల్ప వ్యవధిలోనే పలు విషయాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలవడం గర్వకారణమన్నారు. వంద శాతం అక్షరాస్యత సాకారానికి అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం రాబోయే కాలంలో మరింత పురోగమిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు.
జూన్ నాటికి కాళేశ్వరం ఫలితాలు
మిషన్ భగీరథతో తాగునీటి సమస్య పరిష్కరించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. మిగతా రాష్ట్రాలు మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం ఫలితాలు వందకు వంద శాతం అందుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ నేల నుంచి కరవును శాశ్వతంగా పారద్రోలగలగడం సాధ్యమవుతుందని తెలిపారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో మరొకరి అరెస్టు