KCR Election Campaign Today : భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గంలో ముగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ అక్టోబర్ 15వ తేదీన కేసీఆర్(CM KCR) ప్రారంభించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం.. అదే రోజు హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు.
రోజుకు రెండు, మూడు, నాలుగు చోట్ల జరిగిన ప్రజా ఆశీర్వాద సభ(BRS PRAJA Ashirvada Sabha)ల్లో పాల్గొన్న కేసీఆర్.. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 25న జీహెచ్ఎంసీ ప్రాంతానికి సంబంధించి పరేడ్ గ్రౌండ్స్‌లో జరగాల్సిన సభ జరగలేదు. నిన్నటి వరకు మొత్తం 94 సభల్లో పాల్గొన్నారు. నేడు మరో రెండు ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు కలిపి జరగనున్న సభలో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ అభ్యర్థులు, నాయకులు పూర్తి చేశారు.
రైతుబంధు రగడ - అన్నదాతల నోటికాడి ముద్దను లాగేసిందంటూ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఫైర్
"గులాబీ కుటుంబ సభ్యులు సుమారు లక్ష మంది ఈ సభకు రానున్నారు. ఈ సారి గులాబీ శ్రేణులతో పాటు భారీ జనం రానున్నారు. ఈ ఎన్నికల్లో మూడోసారి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇంకా కొత్త పథకాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయనున్నారు." - వినయ్ భాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
CM KCR Election Campaign End with Gajwel Sabha : వరంగల్‌లో సభ అనంతరం గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఈరోజుతో కలిపి మొత్తం సభల సంఖ్య 96 అవుతుంది. హైదరాబాద్ జిల్లాకు చెందిన 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏడు నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు జరగలేదు. జనగాం నియోజకవర్గంలో రెండు సభల్లో పాల్గొన్నారు. జనగాం, చేర్యాల సభల్లో ఆయన ప్రచారం చేశారు. మొత్తంగా 22 నియోజకవర్గాలు మినహా.. 97 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం(CM KCR Election Campaign) చేసినట్లవుతుంది.
BRS Leaders Election Campaign 2023 : జీహెచ్ఎంసీ పరిధితోపాటు వివిధ నియోజకవర్గాల సభలు, రోడ్ షోలలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్(KTR).. నేడు కామారెడ్డి, సిరిసిల్లలో రోడ్‌షోలలో పాల్గొంటారు. మంత్రి హరీశ్ రావు.. ఈరోజు మెదక్ నియోజకవర్గంలోని చేగుంట, సిద్దిపేట పట్టణం, కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో జరిగే రోడ్‌షోలలో పాల్గొంటారు. మంత్రులు, అభ్యర్థులు.. వారి వారి నియోజకవర్గాల్లో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు.
కామారెడ్డిపైనే స్పెషల్ ఫోకస్ - హేమాహేమాలుగా పార్టీ అధినేతలు - పోరులో నెగ్గేదెవరు?