ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. ఎకరాకు రూ.10,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా రైతులకు సాయం చేసేందుకు వీలుగా జీవో జారీ అయింది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనలకు లోబడి ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకోవాలని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా 2,22,250 ఎకరాల్లో పంట నష్టం: రాష్ట్రవ్యాప్తంగా 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలకు 17,238 ఎకరాల్లో నష్టం జరిగినట్టు తేల్చారు. ఈ మేరకు ఆయా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది.
వ్యవసాయ దశదిశ మార్చిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుకు దక్కుతుంది: కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలతో పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి పరామర్శించడమే కాక.. సర్కార్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కాళేశ్వరంపై పడని వాళ్లు ఎన్నికూతలు కూసినా.. వ్యవసాయ దశదిశ మార్చిన ఘనత ప్రాజెక్టుకు దక్కుతుందని కేసీఆర్ అన్నారు. గాయత్రి పంపు హౌజ్ నిర్మాణ సమయంలో అనేక సార్లు వచ్చినప్పుడు ఇక్కడ పొలాలు కనిపించేవి కాదన్న సీఎం.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనిపిస్తున్నాయన్నారు.
ఎన్ని కష్టాలెదురైనా వ్యవసాయాన్ని వదలొద్దు: ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులు ధైర్యం కోల్పోవద్దని.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నారు. కౌలు రైతులకు తగిన న్యాయం చేస్తామన్నారు. ఎన్ని కష్టాలెదురైనా వ్యవసాయాన్ని వదలొద్దని.. సాగును పట్టుదలగా చేసి సత్ఫలితాలు చూపించాలని పిలుపునిచ్చారు. సీఎం క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. తమను పరామర్శించడం, ఆర్థిక సాయం ప్రకటించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.
వర్షాలు, వడగళ్ల వానకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్.. క్షేత్రస్థాయిలో పర్యటించి భరోసా ఇవ్వడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతులకు రూ.10,000 ఆర్థిక సాయం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు రూ.228 కోట్లు విడుదలకు ఆదేశాలివ్వడం ఎంతో ఓదార్పునిస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ఆర్థిక సాయంతో భవిష్యత్‌పై ఆశలు చిగురించాయని కర్షకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుతో ఎకరాకు సగటున రూ.40,000 పైనే పెట్టుబడి పెట్టామని స్పష్టం చేసిన బాధిత రైతులు.. వీలైతే ఆర్థికసాయం పెంచాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
"మాకు అండంగా ఉంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈసారి పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని సీఎంతో చెప్పాం. ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మీరు ధైర్యం కోల్పోవద్దని అన్నారు. ఎకరాకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది." - బాధిత రైతులు
ఇవీ చదవండి: రద్దీ ఆధారంగా ఛార్జీల ధరలు.. త్వరలో తీసుకొస్తున్న ఆర్టీసీ
మహిళ CRPF జవాన్ల బైక్ ర్యాలీ.. 1650 కిలోమీటర్లు ప్రయాణించి..