కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఛైర్మన్ పార్థసారథి పోలీస్ కస్టడీ ముగిసింది. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. కార్వీ సంస్థకు సంబంధించిన ఆరు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు... ఆయా బ్యాంకుల్లో లావాదేవీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడిదారులకు చెందిన డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లను బ్యాంకుల్లో ఏ విధంగా తనఖా పెట్టారనే విషయాలను పార్థసారథి నుంచి రాబట్టారు. కార్వీ ఆడిట్ నివేదకను పార్థసారథి ముందుంచి... దానికి సంబంధించిన వివరాలను సేకరించారు. పలు బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాన్ని... ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాలను పార్థసారథి నుంచి సేకరించారు.
ఈ నెల 19న అరెస్ట్..
ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి రూ.137 కోట్లు రుణం తీసుకొని తిరిగి చెల్లించని కేసులో పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈ నెల 19న అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. కేసులో పురోగతి కోసం నాంపల్లి న్యాయస్థానం అనుమతితో సీసీఎస్ పోలీసులు ఈనెల 26,27 తేదీల్లో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. పార్థసారథి నుంచి పెద్దగా సమాధానాలు రాకపోవడంతో మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న, ఇవాళ కస్టడీలోకి తీసుకొని సమయం ముగియడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.
తెలియకుండా షేర్లు తనఖా..
బ్యాంకు నుంచి రూ.137కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రతినిధులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్‌లో డీమాట్ ఖాతా ఉన్న పెట్టుబడిదారులకు తెలియకుండా పార్థసారథి, ఇతర డైరెక్టర్లు కలిసి షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టారు. కోట్ల రూపాయల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేశారు. కేసులో మరింత పురోగతి సాధించడానికి కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వాదనను అంగీకరిస్తూ నాంపల్లి న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.
2009లోనే..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన డబ్బులను మళ్లించినట్లు కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై 2009లోనే కేసు నమోదైంది. ఆయన డీమాట్ ఖాతాలో రూ.5 లక్షలకు పైగా నగదు తనకు తెలియకుండా మళ్లించినట్లు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో భీమవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ మేనేజర్‌తో పాటు ఛైర్మన్ పార్థసారథి, వైస్ ప్రెసిడెంట్ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక మేనేజర్ మాత్రమే న్యాయస్థానంలో విచారణకు హాజరవుతున్నారు.
ఇదీ చూడండి: karvy MD arrest: కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథి అరెస్టు