Karvi Stock Broking Company: కార్పొరేట్ బ్యాంకుల్లో రుణాలు తీసుకునేందుకు మదుపర్ల షేర్లు తనఖా ఉంచిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ... యాక్సిస్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చింది. పదమూడేళ్ల క్రితం తీసుకున్న రూ. 159.26 కోట్ల రుణం ఎగవేసింది. అప్పు తీసుకునేటప్పుడు పెట్టిన గ్యారెంటీ, ఆస్తి పత్రాలన్నీ బ్యాంకు వద్దే ఉన్నాయి. కానీ, కార్వీ మదుపర్లకు ఇవ్వాల్సిన సొమ్మును సంస్థ ఆస్తులు జప్తు చేసి చెల్లించాలని సెబీ ఆదేశాలివ్వడంతో... బ్యాంకు వద్ద ఉన్న పత్రాలన్నీ తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ అధికారులు రెండ్రోజుల క్రితం కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి, ప్రమోటర్లు... తమ స్టాక్ బ్రోకింగ్ టర్నోవర్, ఆస్తుల ఆధారంగా రుణాలు కావాలంటూ 2009లో బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌లోని యాక్సిస్‌బ్యాంక్‌ను సంప్రదించారు. 35దేశాల్లో స్టాక్‌బ్రోకింగ్ సేవలు అందిస్తున్నామని... వందల కోట్ల ఆస్తులున్నాయని అధికారులకు వివరించారు. వారు సమర్పించిన పత్రాల ఆధారంగా బ్యాంక్ అధికారులు కార్వీ సంస్థకు 2009 జులైలో రుణాలు మంజూరు చేశారు. పార్థసారథి గ్యారెంటర్‌గా ఉండటంతో రూ. 82.69 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ రుణాన్ని ఇచ్చారు. సంస్థ బుక్‌డెబిట్స్ ఆధారంగా రూ. 47.07కోట్లు ఓవర్ డ్రాఫ్ట్‌గా కొద్దిరోజుల్లోనే రుణాన్ని కేఎస్‌బీఎల్ సంస్థకు మంజూరు చేశారు. స్థిరాస్తుల ఆధారంగా రూ. 26.06 కోట్లు... పార్థసారథి నిర్వహిస్తున్న కంపెనీలకు అందించారు. మరో రూ. 3.42కోట్లు బ్యాంక్ గ్యారెంటీపైన అప్పుగా మంజూరు చేశారు.
రుణాలకు సంబంధించిన కిస్తీలు సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పలు తాఖీదులు ఇచ్చారు. అనంతరం రెండేళ్ల క్రితం ఎన్పీఏగా ప్రకటించారు. ఈ క్రమంలోనే కార్వీ మోసాలు వెలుగు చూడగా... మదుపరుల షేర్లను తనఖా ఉంచి రుణాలు తీసుకున్నారని.. కార్వీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.