సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గ మల్లికార్జున స్వామి వారిని సీఎం సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కీసర గుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ఉన్న శివలింగాలకు దీపాలను వెలిగించి భక్తులు పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మహిళలు ఆలయ ఆవరణలో దీపారాధన చేసి మహా శివుని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో పంచామృత అభిషేకాలు, అర్చనలు మహాదేవునికి నిర్వహించారు.
హుజూర్‌నగర్‌లోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన కార్తిక పూజల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ తీరాల్లో స్నానాలు ఆచరిస్తూ.. పూజలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలోని సోమేశ్వరాలయం భక్తుల రద్దీతో సందడిగా మారింది. తెల్లవారుజామున నుంచే ఆలయ మాఢవీధులు, ఉసిరి చెట్టు వద్ద మహిళలు పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు చేశారు. దీపాలను వెలిగించిన తర్వాత భక్తులు మల్లికార్జున స్వామి, శివాలింగాలను దర్శించుకున్నారు.
ఆలయాల కిటకిట..: నిర్మల్ జిల్లా ముఖద్వారమైన సోన్ గోదావరి వద్ద భక్తులు కార్తిక స్నానాలను ఆచరించి గోదారమ్మకు దీపారాధన చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రాహ్మణులకు దీపదానం, వస్తుదానాలు చేసి మెుక్కులు చెల్లించుకున్నారు. కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా వేయి స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకొని రుద్రేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముందు మహిళలు దీపాలు వెలిగించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వేయి స్తంభాల ఆలయం కిటకిటలాడింది.
ఇతర రాష్ట్రాల నుంచి సైతం..: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేములవాడకు చేరుకున్నారు. కార్తిక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఓంకారేశ్వర స్వామి ఆలయంలో మహిళలు గోధుమ పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటారు. గర్భాలయంలో గల శివునికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి దీపారాధన చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి శివునికి క్షీరాభిషేకం చేసి ఏకబిల్వాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఖమ్మం.. శివోహం..: కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి మహిళా భక్తులు కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. గుంటు మల్లేశ్వరాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. నగరంలోని సుగ్గులవారి తోట శివాలయం, రోటరీనగర్ రాజరాజేశ్వరీ ఆలయం, జలాంజనేయస్వామి ఆలయాల్లో కార్తిక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి..
తెలంగాణలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
రాష్ట్రంలో ఘనంగా ఛట్‌పూజ వేడుకలు.. హుస్సేన్‌సాగర్ వద్ద ఆధ్యాత్మిక శోభ