కేంద్రంలోని భాజపా ప్రభుత్వం, ఆర్.ఎస్.ఎస్.లు కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌లతో పాటు నిత్యావసర ధరలను పెంచుతూ.. సామాన్య ప్రజల నడ్డివిరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఆదాయం తగ్గి ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించకపోవడం దారుణమన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నామని ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని శివాజీ విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే ఈ చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేసి.. రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరుగుతున్న అన్యాయంపై హైదరాబాద్‌లో లక్ష మందితో మహాసభ ఏర్పాటు చేసి.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి వివరిస్తామన్నారు.
అనంతరం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెంపును నిరసిస్తూ బషీర్‌బాగ్ కూడలిలో నిరసన తెలిపారు. ఖాళీ సిలిండర్లు, మెడలో కూరగాయలు ధరించి పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఎన్నికల్లో గెలిచేందుకు పీవీ పేరు వాడుకుంటున్నారు: నారాయణ