ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో సంచలనం కలిగించిన బాలిక దీప్తిశ్రీ అపహరణ కేసులో ఇంకా ఎలాంటి పురోగతి కనిపించలేదు. గత శుక్రవారం జగన్నాధపురం నేతాజీ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఆడుకుంటున్న చిన్నారిని మహిళ, మరో వ్యక్తి కలిసి అపహరించారు. బాలిక కోసం గాలించిన తండ్రి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు.
సవతి తల్లిపై అనుమానం
ఈ వ్యవహారంతో సంబంధం ఉందన్న అనుమానంతో సవతి తల్లి శాంతకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఇంద్రపాలెం లాకులు, ఉప్పుటేరుల్లో వెదికారు. గోదావరిలో మునిగిన పర్యాటక బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం బృందంతో వెతికించారు. అయినా చిన్నారి ఆచూకీ లభ్యమవ్వలేదు. కుటుంబ వివాదాల నేపథ్యంలో దీప్తిశ్రీ అపహరణకు గురైందని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపారు.
చిన్నారి దీప్తిశ్రీ తల్లి మూడేళ్ల క్రితం మృతి చెందింది. తండ్రి సత్యశ్యామ్కుమార్... శాంతకుమారి అనే మహిళను మరో పెళ్లి చేసుకున్నారు. వీరికి మరో కుమారుడు పుట్టాడు. కుటుంబ వివాదాల నేపథ్యంలోనే దీప్తి శ్రీ అపహరణకు గురవ్వడం, సవతి తల్లే అనుమానితురాలు కావడం వల్ల పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని హతమార్చి ఉంటారన్న వదంతుల్ని పోలీసులు కొట్టిపారేసినా.. ఉప్పుటేరులో వెతకడం వీటికి బలం చేకూరుతోంది.
ఇదీ చూడండి: మరణించిన భార్యకు... మందిరం కట్టాడు భర్త..!