KP Chowdary Drugs Case : కబాలి తెలుగు చిత్ర నిర్మాత కేపీ చౌదరి మాదకద్రవ్యాల కేసులో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడితో సినీ పరిశ్రమకు చెందిన అనేక మందికి పరిచయం ఉన్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. తెలుగు, తమిళ సినీ రంగాలకు చెందిన వారితో పాటు రాజకీయ, వ్యాపార వర్గాల వారితో కేపీ చౌదరికి పరిచయమున్నట్టు నిర్ధారించారు. రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న 12 మందితో ఫోన్ ద్వారా జరిపిన సంప్రదింపులు, 11 అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడితో వీరందరికీ ఏ విధమైన పరిచయాలున్నాయనే దానిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించిన వారిలో కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. నిందితుడి ఫోన్‌లో తమ నెంబర్లు ఉన్నంత మాత్రాన తమను కూడా మాదకద్రవ్యాలు వాడే వారి జాబితాలో ఉంచటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘ కొన్ని మాధ్యమాలు తన పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ డ్రగ్స్ కేసులో తన పేరును ప్రస్తావించటం పట్ల సినీ నటి అషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు.
Celebrities Involved In KP Choudary Drugs Case : కొంతమంది వ్యక్తులతో తన సంబంధాలను పలు మీడియా సంస్థలు చూపుతున్న అంశాలను ఖండించారు. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. తన మొబైల్ నెంబర్‌ను అందరికీ తెలిసేలా ప్రచురించటాన్ని అంగీకరించను అన్నారు. కొన్ని సందర్భాల్లో తప్పకుండా స్పందించి తీరాలంటూ ఇన్‌స్టాలో మరో పోస్టు ఉంచారు. మరో సినీ నటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు తన వ్యక్తిగతమన్నారు. ఈ కేసులో పోలీసులకు సహకరిస్తానన్నారు. మరోవైపు రిమాండ్ రిపోర్ట్‌లో నిందితుడితో సంబంధం ఉన్నట్టు పేర్కొన్న 12 మంది చుట్టు ఉచ్చు బిగిసుకుంటోంది. వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు.
KP Choudary Drugs Case Updates : సినీ నిర్మాత కేపీ చౌదరి ఈ ఏడాది మే నెలలో నగరంలో పార్టీ నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ పార్టీకి పలువురిని ఆహ్వానించినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వాహణ కోసం స్నేహితహిల్స్‌లోని సిక్కిరెడ్డి నివాసం ఉపయోగించినట్టు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై సిక్కిరెడ్డి భర్త బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుమిత్ మీడియా ద్వారా స్పందించారు. తమ వివాహ సమయంలో స్నేహితహిల్స్‌లోని ప్లాట్‌ను ఇచ్చారని వివరించారు. కేపీ చౌదరి తెలిసిన వ్యక్తి కావటంతో నాలుగు రోజుల పాటు వాడుకుంటామంటే ఇచ్చినట్టు చెప్పారు. అతను ఎటువంటి వ్యక్తి అనే విషయం తమకు తెలియదన్నారు. పరిచయమున్న వ్యక్తి అనే ఉద్దేశంతో ఇంటిని ఇచ్చామన్నారు. క్రీడాకారులుగా తాము చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తామని, కొద్ది రోజులు తలదాచుకునేందుకు ప్లాట్‌ను ఇస్తే ఇలా తమ కుటుంబాన్ని బయటకు తీసుకురావటం భావ్యంగా లేదంటూ సిక్కిరెడ్డి కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.
ఈ కేసులో ఇప్పటి వరకూ బయటకు వచ్చిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనే అంశం చర్చనీయంగా మారింది. ఈ ఏడాది మే మొదటి వారంలో రాయదుర్గంలో సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కేపీచౌదరి మత్తుపదార్థాల వినియోగదారుడిగా చేర్చారు. అనంతరం అతడు కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించి మాదకద్రవ్యాలతో పట్టుకొని అరెస్ట్ చేశారు. నిందితుడికి పరిచయమున్న వారు ఎవరెవరు మత్తుపదారాలు వాడుతున్నారు, ఇంకా ఎవరు కొకైన్ విక్రయిస్తున్నారనే విషయం తేలిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టడానికి పోలీసులు సిద్దమవుతున్నారు. మాదకద్రవ్యాల వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయోనని సినీ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇవీ చదవండి: