Justice Alok Aradhe Swears in as CJ of Telanagan HC : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ అలోక్ అరాధేతో సీజేగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ యాదవ్, పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు.
CM KCR Wishes to New CJ Justice Alok Aradhe : ప్రమాణ స్వీకారం అనంతరం.. తొలుత గవర్నర్ తమిళిసై కొత్త సీజే అరాధేకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీజేకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. సరిగ్గా ఏడాది తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. గత ఏడాది జులైలో హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అప్పటి నుంచి రాజ్‌భవన్‌తో అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్, సీఎం ఎడమొహం పెడమొహంలా కొనసాగుతున్నారు. మళ్లీ ఏడాది తర్వాత ఇవాళ సీఎం కేసీఆర్ గవర్నర్‌తో కలిసి ఒకే వేదికపై కనిపించటం ఆసక్తికరంగా నిలిచింది. సీజే ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం రాజ్‌భవన్ మెయిల్ లాంజ్‌లో తేనేటి విందు సాగింది.
తెలంగాణ నూతన సీజే జస్టిస్ అలోక్ అరాధే నేపథ్యమిదీ.. : రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లో 1964 ఏప్రిల్ 13న జన్మించారు. 1988 జులై 12న న్యాయవాదిగా చేరారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2009 డిసెంబరు 29న నియమితులయ్యారు. జమ్ముకశ్మీర్ న్యాయమూర్తిగా 2016 సెప్టెంబరు 16న బదిలీ అయిన జస్టిస్ అలోక్ అరాధే.. ఆ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఛైర్మన్‌గా చేశారు. జస్టిస్ అలోక్ అరాధే 2018లో మూడు నెలల పాటు జమ్ముకశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2018 నవంబరు 17 నుంచి కొనసాగుతున్న జస్టిస్ అలోక్.. కొంతకాలం కర్ణాటక తాత్కాలిక సీజేగా చేశారు. కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.
మరో మూడు రాష్ట్రాలకు హైకోర్టు నూతన సీజేలు : తెలంగాణ రాష్ట్రంతో పాటు గుజరాత్, ఒడిశా, కేరళ హైకోర్టులకు కూడా ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు.. రాష్ట్రపతి ఆమోదంతో న్యాయశాఖ నియమించింది.
ఇవీ చదవండి :