గాంధీ ఆసుపత్రిలో జూడాల నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. విధులు బహిష్కరించి... సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బైఠాయించిన జూడాలు ఆసుపత్రి ఆవరణలోనే ర్యాలీ నిర్వహించారు.
గత ఏడు నెలల నుంచి కొవిడ్ రోగులకు వైద్యం అందిస్తున్న జూనియర్ డాక్టర్లు... కేవలం కొవిడ్ రోగులకు వైద్యం చేస్తూ... మిగతా రోగులకు వైద్యం అందచేందుకు కావాల్సిన శిక్షణను పొందలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోనే పెద్దదైన గాంధీ హాస్పిటల్, మెడికల్ కళాశాలను కేవలం కొవిడ్ కోసం ఉపయోగించడం వలన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల విద్యా సంవత్సరం కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మూడు వందల మంది కొవిడ్ రోగులకు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఉపయోగించడం వలన వందలాది మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు.
అనేకసార్లు ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఇక్కడి నుంచి కొవిడ్ రోగులను ఇతర హాస్పిటల్‌కు తరలించాలని కోరారు. తద్వారా వేలాది మంది ఇతర రుగ్మతలతో బాధపడుతున్న పేద ప్రజలకు సరైన వైద్యం అందించడంతో పాటు జూనియర్ డాక్టర్లు తమ శిక్షణ పొందడం ద్వారా విద్యా సంవత్సరం కోల్పోకుండా కాపాడటానికి వీలు కలుగుతుందని అన్నారు.