తన వద్ద పనిచేసే డ్రైవర్ని విచక్షణారహితంగా కొట్టినందుకు ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారులైన ఆదిత్య రెడ్డి, సాయినాథ్ రెడ్డిల మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు.నందినగర్‌లో నివసించే మేక వెంకటేష్ గత ఆరేళ్లుగా ఆదిత్య హోమ్స్ ఎండీ కోటారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం వెంకటేష్ తన కుటుంబంతో గడిపేందుకు సొంతూరికి వెళ్లాడు. ఆగష్టు 2న తిరిగి హైదరాబాద్ వచ్చాడు.
నగరానికి తిరిగి వచ్చిన వెంకటేష్ విధులు నిర్వర్తించేందుకు వెళ్లగా అతన్ని కోటారెడ్డి లోపలికి రమ్మని పిలిచి విచక్షణారహితంగా కొట్టాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడే ఉన్న అతని కుమారుడు ఆదిత్యరెడ్డి, అతడి స్నేహితుడు సాయినాథ్ రెడ్డి కలిసి వెంకటేష్ ఫోన్ లాక్కుని మూడు గంటలపాటు గదిలో నిర్బందించి తీవ్రంగా కొట్టారని ఏసీపీ పేర్కొన్నారు. తమ సమాచారాన్ని వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డికి ఎందుకు చెబుతున్నావని కొడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని డ్రైవర్ వెంకటేష్ ఫిర్యాదు చేశాడని ఏసీపీ తెలిపారు.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు