కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం ముగిసింది. జలవిద్యుదుత్పత్తి అంశంపై మరోమారు సమావేశంలో చర్చించారు. విద్యుత్ అంశాన్ని పూర్తి చేద్దామని ఏపీ అధికారి శ్యామలరావు సూచించగా.. తమ అభిప్రాయం ఇప్పటికే స్పష్టం చేశామని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తేల్చిచెప్పారు. మళ్లీ చర్చ అంటే మరోమారు సమావేశానికి రానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా నిలబడే రజత్ కుమార్ వాదనలు వినిపించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం ఉంటుందని బోర్డులు స్పష్టం చేశాయి. అంటే ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం ఉంటుందని తెలిపింది.
కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కావాలని కోరామని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వెల్లడించారు. అయితే వాటాలు ఖరారు చేసే అధికారం లేదని కృష్ణా బోర్డు చెప్పిందని రజత్‌కుమార్ పేర్కొన్నారు. 299, 512 టీఎంసీల చొప్పున నీటి వాటాలు కొనసాగుతాయని కేఆర్ఎంబీ చెప్పినట్లు తెలిపారు.
పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా చూడాలని కోరామన్న రజత్‌కుమార్.. గెజిట్ నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి ట్రైబ్యునల్ అనుమతులున్నాయని.. వివరాలు చెప్పాక కూడా బోర్డు సానుకూలంగా స్పందించలేదన్నారు. రెండు బోర్డులు పాత వాటినే కొనసాగించేందుకే మొగ్గు చూపాయని వెల్లడించారు. విద్యుత్ విషయంలో బోర్డు వైఖరికి నిరసనగానే వాకౌట్ చేశామని స్పష్టం చేశారు.
కేఆర్ఎంబీ విఫలం..
'కాళేశ్వరం అదనపు టీఎంసీ, తుపాకులగూడెం, కంతనపల్లి డీపీఆర్‌లు ఇచ్చాం. దేవాదుల, మొడికుంటవాగు. చనాఖా-కొరటా ప్రాజెక్టుల డీపీఆర్‌లు తయారవుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడుకు కేటాయింపులపై నిరసన తెలిపాం. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తామని చెప్పాం. గోదావరి జలాలకు బదులుగా 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తీసుకుంటామన్నాం. టెలీమెట్రీ విషయంలో కేఆర్ఎంబీ విఫలమయింది. ఇతర సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో బోర్డులు చెప్పాలి. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు పూర్తి స్థాయి కార్యాచరణ అవసరం.'
- రజత్ కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఇదీచూడండి: KRMB MEETING: కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్