దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్న అన్ని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీకి ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని విద్యపై పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ జాబితాలి కేంద్రీయ వర్సిటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, ఐసర్లు తదితర వాటిల్లో 30-40 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో సంస్థ నియామకాలు చేపట్టం వల్ల ఖాళీల భర్తీలో జాప్యమవుతుందని గుర్తించిన కమిటీ ఉమ్మడి పరీక్ష నిర్వహణపై దృష్టిపెట్టాలని పేర్కొంది. జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) లేదా యూపీఎస్‌సీకి బాధ్యతలు అప్పగించాలని లేదా స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. గత ఫిబ్రవరి నాటికి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 6,210 బోధన, 12,437 బోధనేతర, ఐఐటీల్లో 3,876 బోధన, 4,182 బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రిపుల్‌ఐటీల్లో 147 బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులూ ఖాళీ
దేశవ్యాప్తంగా 31 ఎన్‌ఐటీలు ఉండగా అందులో 21 సంస్థలకు, 23 ఐఐటీల్లో ఎనిమిదింటికి పాలకమండలి ఛైర్మన్లు(గవర్నింగ్ బాడీ) లేరు. కీలకమైన సంచాలకుల(డైరెక్టర్) పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు ఐఐటీలు, అయిదు ఎన్‌ఐటీలకు డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. వరంగల్ ఎన్‌ఐటీకి గత మూడేళ్ల నుంచి ఛైర్మన్ లేరు. చివరిసారిగా 2013 నుంచి 2015 వరకు భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న ఎన్‌వీ రమణారావు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి: Pegasus: ఈ సంకేతాలుంటే.. మీ ఫోన్ హ్యాక్ అయినట్లే!