harshitha got a job at Amazon: ఐఐటీలో చదవడం ఆ యువతి కల. ఉన్నత విద్య ఉంటేనే... సమాజంలో మంచి గౌరవంతో పాటు స్థిరమైన జీవన ప్రగతి ఉంటుందని విశ్వసించింది. కానీ, తృటిలో ఐఐటీ సీటు తప్పిపోయినా నిరుత్సాహపడలేదు. అన్న ప్రోత్సాహంతో కష్టపడి చదివింది. నైపుణ్యాలు మెరుగుపరుచుకుంది. అమ్మ లేకపోయినా.. అమ్మకిచ్చిన మాట నిజం చేస్తూ.. అమెజాన్‌లో 44లక్షల రూపాయల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించింది.
44 లక్షల రూపాయల ప్యాకేజీ: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చౌడేపల్లెకు చెందిన హర్షిత.. కడప జిల్లా పులివెందుల జేఎన్టీయూలో ఈసీఈ చివరి సంవత్సరం చదువుతోంది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఈమె తాజాగా అమెజాన్ సంస్థలో... ఆరంభంలోనే 44 లక్షల రూపాయల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ ఉద్యోగానికి ఫ్రెషర్స్ కోటాలో ఎంపికై తన ప్రత్యేకత చాటుకుంది.
మా అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను చూడటానికి వస్తాను అంటే... వద్దు నువ్వు కష్టపడి చదువు. నువ్వు కోడింగ్ నేర్చుకో.. అన్నది. ఏ రోజు నా పేరెంట్స్ నన్ను ఫోర్స్ చేయలేదు. మిడిల్ క్లాస్ సమస్యలు నాకు తెలుసు. కష్టాలు తెలుసు. అందుకే నేను కష్టపడి చదివి.. మా అమ్మ కల నేరవెర్చాను.
-హర్షిత, జేఎన్‌టీయూ విద్యార్థిని
అమెజాన్ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో.. ప్రతిభ కనబరచిన హర్షిత.. జూన్‌లో కొత్త ఉద్యోగంలో ఉత్సాహంగా చేరేందుకు సిద్ధమవుతోంది. మంచి ఉద్యోగం అనేది మధ్యతరగతి కుటుంబానికి చాలా ముఖ్యమని, అప్పుడే కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతోందంటుంది హర్షిత. మంచి వేతనంతో కొలువు సాధించడం పట్ల హర్షిత సంతోషం వ్యక్తం చేస్తోంది.
ఊళ్లో మంచి గుర్తింపు: హర్షిత వాళ్లది మధ్యతరగతి కుటుంబం. నాన్న ఫెర్టిలైజర్స్ డీలర్. చిన్నప్పటి నుంచి అమ్మే దగ్గరుండి చదివించేది. అన్న ప్రీతమ్.. మైక్రోసాఫ్ట్‌లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంతో ఊళ్లో మంచి గుర్తింపు వచ్చింది. నువ్వూ అలా ఉద్యోగం సంపాదించాలంటూ తల్లి తరచూ చెప్పడంతో ఆ ఉత్సాహం రెట్టింపైంది. సోదరుడి సూచనలతో కంప్యూటర్ కోడింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై దృష్టి సారించింది.
చదువుకునే టైంలో చదువుకోవాలి. ప్రతి ఒక్కరికి ఓ కల ఉండాలి. దాన్ని నేరవేర్చడానికి కష్టపడాలి. రోజు నైట్ పడుకునే ముందు దాని గురించి ఆలోచించాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం.
-హర్షిత, జేఎన్‌టీయూ విద్యార్థిని
2వేల మంది పోటీ పడగా: బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ హర్షిత చేసిన ప్రయత్నాల్లో టీసీఎస్, కెల్టన్ టెక్ సహా మరో రెండు బహుళ జాతి ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చాయి. కానీ, అవి సంతృప్తినివ్వలేదు. చివరకు అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థలో ప్రయత్నం చేసింది. 2వేల మంది పోటీ పడగా.. ఎంపికైన 15మందిలో హర్షిత ఒకరు. ఈ విషయం తెలియగానే అనంతపురం జేఎన్‌టీయూ ఉపకులపతి రంగా జనార్థన్ సన్మానం చేసి అభినందించారు.
ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ఏమన్నారంటే..?