ఇంజినీరింగ్, ఫార్మసీ చివరి ఏడాది పరీక్షలు జులై 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ ప్రకటించింది. గతంలో ఇచ్చిన అకడమిక్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి పరీక్షలు జరగాలి. ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో షెడ్యూల్‌ను సవరిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ శనివారం కొత్త కాలపట్టిక విడుదల చేశారు.
ఏఐసీటీఈ మార్గదర్శకాల మేరకు సెమిస్టర్ వ్యవధి 90 రోజులు ఉండాలి. క్రెడిట్ కోర్సులను బట్టి నిర్దేశిత గంటల పాటు బోధన జరగాలి. గత నెల 12 నుంచి లాక్‌డౌన్ వల్ల తరగతులు సరిగా సాగకపోవడంతో షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 26వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయి. రెండో విడత మిడ్‌టర్మ్ పరీక్షలు జరుగుతాయి. 28 నుంచి 30 తేదీ మధ్య ప్రాజెక్టు వైవా నిర్వహిస్తారు. అనంతరం చివరి సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి.
సొంతూరికి దగ్గర్లోనే పరీక్ష కేంద్రం..
విద్యార్థి సొంతూరికి చేరువలోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. పరీక్ష కేంద్రాలను ఎంచుకునే అవకాశం విద్యార్థులకే ఇచ్చింది. ఈ మేరకు వర్సిటీ పరీక్షల విభాగం సంచాలకులు వి.కామాక్షి ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు తమకు సమీపంలోని అనువైన పరీక్ష కేంద్రం ఎంచుకోవాలనుకుంటే సంబంధిత కళాశాలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట్రంలోని కళాశాలలను క్లస్టర్ల వారీగా జేఎన్‌టీయూ విభజించింది. విద్యార్థులు ఏవైనా మూడు వేర్వేరు క్లస్టర్లలోని కళాశాలలను ఎంచుకోవచ్చు. ఒకటి కచ్చితంగా జేఎన్‌టీయూ అనుబంధ లేదా గుర్తింపు పొందిన ఇంజినీరింగ్ లేదా ఫార్మసీ కళాశాల అయి ఉండాలి. ఐచ్ఛికాలను ఎంచుకోని వారు తాము చదువుతున్న కళాశాలలోనే పరీక్ష రాసేందుకు అంగీకారం తెలిపినట్లుగా భావిస్తారు. విద్యార్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నెల 12వ తేదీలోగా జేఎన్‌టీయూకు ఆయా కళాశాలలు సమాచారం అందించాలి. దీనిబట్టి పరీక్ష కేంద్రాలను వర్సిటీ ఎంపిక చేసుకుంటుంది.
- విద్యార్థి చదివే కళాశాలలోనే పరీక్ష రాయాలనుకుంటే ఎలాంటి ఐచ్ఛికాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.
- సొంతూరికి దగ్గర్లోని కళాశాలలను 1, 2, 3 క్రమసంఖ్య ప్రకారం ఎంచుకోవాలి.
- విద్యార్థి ఇచ్చిన ఐచ్ఛికాలలోంచి ఏదో ఒక కళాశాలను పరీక్ష కేంద్రంగా వర్సిటీ కేటాయిస్తుంది.
- ఎంపిక చేసుకున్న కళాశాలను పరిమితికి మించి ఎంచుకుంటే, ఆ విద్యార్థులు తాము చదివినచోటే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Registrations: సర్వర్‌లో సాంకేతిక సమస్య.. ఆగిన రిజిస్ట్రేషన్లు.!