తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని సినీనటి జీవితా రాజశేఖర్ అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకున్న సందర్భంగా జీవిత కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌తో కలిసి తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీనే దేశాన్ని కాపాడగలరని నమ్మి భాజపాలో చేరానని వివరించారు. భాజపా రాష్ట్ర అధినేతగా బండి సంజయ్ ఎంతో కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.

‘‘ఇద్దరు ఆడపిల్లల తల్లిగా మహిళల కష్టాలు తెలిసిన దాన్ని. తెలంగాణలో తెరాస ప్రభుత్వం చేస్తున్న పాలన ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి.. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతా. బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్రకు మద్దతు తెలిపేందుకే పాదయాత్రలో పాల్గొన్నా. సంజయ్ ఎంతో సమర్థవంతమైన నాయకుడు.. ప్రజల్లోకి ఆయన వెళుతున్న తీరు అద్భుతం’’ - జీవితా రాజశేఖర్

ఇవీ చూడండి: