Jeevan Reddy on TRS MLAs Buying Issue: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరాస, భాజపా దొంగాటకు తెరలేపాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో గెలవాలన్న తపన సహజం.. కానీ, ఇప్పటి వరకు స్థానిక నాయకుల కొనుగోలుకే పరిమితమైన నేపథ్యంలో.. ఏకంగా చట్టసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలపై వల వేయడం దారుణమని విమర్శించారు. ఇది రాజకీయ వికృత క్రీడకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నీతి బాహ్యమైన చర్య అని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో జీవన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
స్వామీజీలతో పార్టీ మార్పు బేరసారాలు సాగించడం దురదృష్టకరం: తెలంగాణ ఆవిర్భావం సమయంలో నీతి, నిజాయితీ.. పారదర్శకంగా పాలన ఉంటుందని ఆశించామని జీవన్‌రెడ్డి తెలిపారు. కానీ, తెరాస ఏలుబడిలో ఇతర పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల కొనుగోలు ప్రక్రియకు తెరలేపిందని ఆరోపించారు. ఈ విధానంను అనుకరించడం అంటే తెరాస ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. స్వామీజీలతో పార్టీ మార్పు బేరసారాలు సాగించడం దురదృష్టకరమని అన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన పైలట్ రోహిత్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, రేగా కాంతారావు తెరాసలో చేరారని.. ఒక పర్యాయం పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యేలు అయితే సులభంగా లొంగిపోతారని గుర్తించి మళ్లీ పార్టీ మార్పించేందుకు ప్రలోభపెట్టారని ఆరోపించారు. అప్పట్లో తెదేపా నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను చేర్చుకుని ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత తెరాసది అని ఆక్షేపించారు. మంత్రివర్గంలో చోటు కల్పిస్తే అప్పట్లో గవర్నర్ ఏ విధంగా ఆమోదించారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి: తక్షణమే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై విచారణకు సంబంధించి సీబీఐపై తమకు విశ్వాసం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని అమిత్ షాతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయించాలని సూచించారు. అలాగే, మునుగోడు ఉపఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా మద్యం ఏరులైపారుతోందని ఆరోపించారు. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ సాగుతున్న దృష్ట్యా ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకుని పోటీపడుతున్న ఇరు పార్టీల అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
"రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒకటి. మరొకటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ వికృత క్రీడకు తెరతీసింది. అందుకే ఇరు పార్టీల అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలి. తక్షణమే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలి. ఈ విషయంపై కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని అమిత్ షాతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయించాలి. అంతే కానీ దేవుడి మీద ప్రమాణం చేయమని అంటున్నారు. అవి ఏమీ కావు. మీకు చిత్తశుద్ధి ఉంటే అమిత్ షాతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయించాలి." - జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: తెరాసతో నందకుమార్‌కు సత్సంబంధాలు.. ఇవిగో సాక్ష్యాలు: కిషన్‌రెడ్డి
నలుగురు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు యత్నాలు.. దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురి అరెస్ట్
Bandi on Buy TRS MLAs Issue: 'కేసీఆర్ దమ్ముంటే యాదాద్రికి రా.. ప్రమాణం చేద్దాం'
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళనకు దిగిన భాజపా శ్రేణులు