JEE Mains: జేఈఈ మెయిన్స్ పరీక్షలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. పరీక్ష నిర్వహణలో సాంకేతిక లోపాలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. పలు కేంద్రాల్లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో నిర్ణీత కాలంలో పరీక్ష జరగక విద్యార్థులు అసహనానికి గురయ్యారు. కొన్ని ప్రశ్నలు కనిపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షల నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విఫలమైందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆది నుంచి గందరగోళమే...
జేఈఈ మెయిన్స్ తొలి దశ పరీక్ష దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం హైదరాబాద్ సీఎంఆర్ కళాశాలలోని కేంద్రంలో మధ్యాహ్నం బీఆర్క్ పరీక్ష సుమారు గంట ఆలస్యంగా మొదలైంది. శుక్రవారం కూడా హైదరాబాద్‌లోని రెండు కేంద్రాల్లో ఇదే గందరగోళం తలెత్తింది. అబిడ్స్‌లోని అరోరా కాలేజీలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావల్సిన పరీక్ష.. దాదాపు పదిన్నరకు ప్రారంభమైందని విద్యార్థులు చెబుతున్నారు. ఉదయం ఏడున్నర నుంచే లోనికి అనుమతించాల్సి ఉంటుంది. అయితే, హాల్ టికెట్‌పై బార్‌కోడ్ స్కాన్ చేయడంలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. అదే విధంగా పరీక్ష సమయంలో సర్వర్ సమస్యల వల్ల 26 ప్రశ్నలు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముసారాంబాగ్‌లోని అరోరా కళాశాల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావల్సిన పరీక్ష.. పదిన్నర తర్వాత ప్రారంభమైందని విద్యార్థులు వాపోయారు. పరీక్ష జరుగుతున్న సమయంలోనూ కంప్యూటర్‌లో గందరగోళం తలెత్తిందన్నారు.
తేదీల ప్రకటన నుంచి నిర్లక్ష్యమే..!
జేఈఈ మెయిన్స్ నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. పరీక్ష తేదీల ఖరారు నుంచి ఫలితాల వెల్లడి వరకు ఎన్‌టీఏ గందరగోళ వైఖరి ప్రదర్శిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. జేఈఈ నిర్వహణ బాధ్యతను ఎన్‌టీఏ ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఈ ఏడాది కొన్ని కొత్త కేంద్రాల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త కేంద్రాల్లో సాంకేతిక సామర్థ్యాన్ని సరిగా మదించకుండా పరీక్ష నిర్వహిస్తుండటంతో ఈ గందరగోళానికి దారి తీస్తోందన్నారు.
అరోరా కాలేజీలో పరీక్ష వాయిదా..
అబిడ్స్‌లోని అరోరా కాలేజీలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావల్సిన పరీక్ష దాదాపు పదిన్నరకు ప్రారంభం కాగా, మధ్యాహ్నం పరీక్ష పూర్తిగా వాయిదా పడింది. సర్వర్ ప్రాబ్లమ్‌తో పరీక్షను వాయిదా వేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష నిర్వాహణ తేదీని విద్యార్థులకు మెయిల్ చేస్తామని కాలేజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. పూర్తి సమాచారం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ)వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. 'సర్వర్ ప్రాబ్లమ్‌తో ఈ సెంటర్‌లో పరీక్షను వాయిదా వేస్తున్నాం. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహించేది ఎన్‌టీఏ నిర్ణయిస్తుంది. 30వ తేదీన వేరే పరీక్షలు లేకుంటే ఆ రోజు నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షపై విద్యార్థులు ఆందోళన చెందవద్దు' అని ప్రిన్సిపల్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..