ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ వద్ద మావోయిస్టుల దాడిలో మృతిచెందిన వీరజవాన్ మురళీకృష్ణ భౌతికకాయాన్ని ఏపీలోని గుంటూరు జిల్లా గుడిపూడిలోని ఆయన నివాసానికి తరలించారు. మొదట సత్తెనపల్లికి తీసుకొచ్చిన పార్థివదేహానికి స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గౌరవవందనం సమర్పించారు. అనంతరం.. ర్యాలీగా ఆయన స్వగ్రామం గుడిపూడికి తీసుకెళ్లారు. అమర జవాను భౌతికకాయాన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.
అశ్రునయనాల మధ్య..
మావోయిస్టుల దాడిలో మరణించిన.. అమర జవాన్లకు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. మురళీకృష్ణ, విజయనగరం జిల్లాకు చెందిన జగదీశ్ కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించారు. అశ్రునయనాల మధ్య అమర జవాన్ మురళీకృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో సీఆర్‌పీఎఫ్ జవాన్లు గౌరవ సూచికగా గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ విశాల్ గున్నీ ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. వేల మంది ప్రజానీకం తరలివచ్చి మురళీకృష్ణకు తుది వీడ్కోలు పలికారు. జోహార్ మురళీకృష్ణ, అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో అంతిమసంస్కారాలు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: జవాను మురళీకృష్ణకు రాష్ట్ర పోలీసుల నివాళి