కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ నగరం బోసిపోయింది. జనసంచారం లేక నగరంలోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు జనాలు లేక బోసిపోయాయి. దాదాపు 90 శాతం ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు.
నిత్యం వేలాది ప్రయాణికులతో కళకళలాడుతూ ఉండే కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి, మలక్‌పేట్ రైల్వే స్టేషన్లు జనాలు లేక వెలవెలబోయాయి. ఆదర్శ్‌నగర్‌లోని బిర్లామందిర్, బిర్లా సైన్స్ సెంటర్‌ను గేట్లు మూసివేసి లోపలికి ఎవరిని అనుమతించ లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే చంపాపేట్, మదన్నపేట్ కూరగాయల మార్కెట్, మలక్ పేట్, మహబూబ్ పెన్షన్ మార్కెట్, మలక్‌పేట్ ఏరియా హాస్పిటల్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దిల్సుఖ్నగర్, సంతోశ్‌నగర్, సైదాబాద్, చాదర్‌ఘాట్, కొత్తపేట, సనత్‌నగర్, మైత్రివనం, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.
జనతా కర్ఫ్యూకు మద్దతు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు వాహనాదారులను కోరారు. అబిడ్స్‌లో కరోనా వైరస్ నివారణకు సహకరించాలని ఫ్లకార్డ్స్‌తో అవగాహన కల్పించారు. నాంపల్లి, బషీర్ బాగ్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు. వృద్ధులు, చిన్నారులు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: గుమ్మాలు, బాల్కనీల్లో నిల్చొని చప్పట్లు కొట్టండి-ప్రధాని