తాగునీటి పథకాల కోసం ఇంజనీరింగ్ అద్భుతాలు కాకుండా... వీలైనంత వరకు స్థానిక వనరులపైనే ఆధారపడి పనులు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అభిప్రాయపడ్డారు. కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టులను చివరి అవకాశంగానే ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో జల్ జీవన్ మిషన్ అమలుపై సమీక్షించారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్పతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన అధికారులు, ఇంజనీర్లు సదస్సుకు హాజరయ్యారు.
మిషన్ భగీరథ వ్యయాన్ని కేంద్రమే భరించాలి...
మిషన్ భగీరథ నిర్వహణా వ్యయాన్ని భరించాలని సీఎస్ ఎస్కే జోషి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ కోసం ఖర్చు చేసే నిధులను జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు ఇవ్వడంతో పాటు రాష్ట్రాలు రుణాలు తీసుకునే పరిమితి పెంచాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్... తాము చేపట్టబోతున్న గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు.
జల్ జీవన్ మిషన్ పూర్తి చేసేందుకు సహకరించాలి
2024 కల్లా జల్ జీవన్ మిషన్ పూర్తి చేసేందుకు రాష్ట్రాలు, అధికారులు కష్టపడి సహకరించాలని కోరిన కేంద్ర మంత్రి షెకావత్... బడ్జెట్‌కు లోబడి రాష్ట్రాలకు నిధులు సమకూర్చడంతో పాటు నాబార్డ్, ఇతర సంస్థలను సంప్రదిస్తున్నట్లు వివరించారు. తాము మారుతి 800 ఇవ్వాలనుకుంటున్నామని, ఏ రాష్ట్రమైన రోల్స్ రాయిస్ లేదా జాగ్వార్ సమకూరుస్తామంటే వారి సొంత నిధులతో చేపట్టవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో పారిశుద్ధ్యంపై కేంద్ర జలశక్తి శాఖ దక్షిణాది సదస్సు