తక్షణమే పైప్‌లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని, ముంపునకు గురైన ప్రాంతల ప్రజలకు ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరా చేయాలని జలమండలి ఎండీ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన బండ్లగూడ చెరువు, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారా కాలనీ, అయ్యప్ప కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
పునరావాస ప్రాంతాల్లో వాటర్ ప్యాకెట్లు, క్యాన్ల ద్వారా తాగు నీటిని అందించాలని అధికారులకు సూచించారు. నీట మునిగిన సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రపరచి.. తర్వాత నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి వాడుకోవాలన్నారు. ఇప్పటికే జలమండలి ఆధ్వర్యంలో క్లోరిన్ బిల్లల పంపిణీ జరుగుతుందని తెలిపారు.
మంచినీరు, మురుగు నీరుకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే జల మండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇదీ జరిగింది..
పిర్జాదిగూడ నల్ల చెరువుకి గండి పడటం వల్ల కట్టకు ఆనుకుని ఉన్న జల మండలి తాగు నీటి పైప్లైన్లు ధ్వంసం అయ్యాయి. ఫలితంగా పిర్జాదిగూడ, ఉప్పల్ మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయింది.