ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తులకు సంబంధించిన పెన్నా సిమెంట్స్ కేసులో అదనపు ఛార్జిషీట్‌పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరించవద్దని సీబీఐ కోర్టును జగన్, ఇతర నిందితులు కోరారు. పెన్నా సిమెంట్స్‌లో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్, గనుల శాఖ మాజీ అధికారి వీడీ రాజగోపాల్, డీఆర్ఓ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మలపై 2016లోనే సీబీఐ అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది.
పెన్నా కేసులో హైకోర్టు స్టే తొలగిపోవడంతో... అనుబంధ అభియోగపత్రానికి మళ్లీ కదలిక వచ్చింది. అనుబంధ అభియోగపత్రంలో కొత్తగా ఎలాంటి విషయాలు లేవని.. పాత ఛార్జిషీట్లోని విషయాలతోనే కొత్తగా నిందితులను చేర్చడం చట్టవిరుద్ధమని జగన్, ఇతర నిందితుల తరఫున న్యాయవాదులు వాదించారు. పెన్నాకు భూముల కేటాయింపు, గనుల లీజుల మంజూరులో అప్పటి మంత్రులు సబిత, ధర్మాన, అధికారుల నిర్ణయాలన్నీ మొదటి ఛార్జిషీట్లోనే ప్రస్తావించినప్పటికీ... అప్పుడు నిందితులుగా చేర్చకుండా.. అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయడమేంటని ప్రశ్నించారు. కేబినెట్ ఉమ్మడి నిర్ణయాలను సబిత, ధర్మానలకు వ్యక్తిగతంగా ఆపాదించడం సరికాదని.. సీబీఐ అధికారులు మంత్రి మండలి నిర్ణయాలను సమీక్షిస్తే ఎలా అని వాదించారు. అనుబంధ అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని వాదించారు. సీబీఐ వాదనల కోసం విచారణను న్యాయస్థానం ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చూడండి:"యురేనియం"పై గవర్నర్‌ను కలిసిన సీపీఐ