IT raids at Mallareddy Properties : రెండున్నర రోజులపాటు ఉత్కంఠ సృష్టించిన మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, సంస్థల్లో బంధువుల ఇళ్లల్లో ఐటీ దాడులు ముగిశాయి. గడిచిన 3 రోజులుగా కొనసాగిన ఈ సోదాలు.. ఈ మధ్యాహ్నం ముగిసినట్లు ఆదాయపన్నుశాఖ వర్గాలు వెల్లడించాయి. 400 మంది అధికారులు, సిబ్బందితో... 65 బృందాలుగా ఏర్పడి నిర్వహించిన తనిఖీలు రెండున్నర రోజులపాటు కొనసాగాయి. పలు చోట్ల కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకోవడంతోపాటు.. నగదు, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు.
IT officers seized Money from Mallareddy house : మల్లారెడ్డి ఆస్తులపై జరిపిన సోదాల్లో దాదాపు రూ.15 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు మూడ్రోజులపాటు కొనసాగిన సోదాల్లో మల్లా రెడ్డి వ్యాపార లావాదేవీలల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించినట్లు తెలిపాయి. మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్ల విషయంలో విద్యార్ధుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిబంధనలను తుంగలో తొక్కి కార్యకలాపాలు నిర్వహించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. మల్లారెడ్డికి చెందిన అన్ని రకాల కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూల్ చేసినట్లు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు.
IT raids ended at Mallareddy Properties : మల్లారెడ్డి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇప్పటి వరకు పరిశీలించిన మేరకు.. వస్తున్నఆదాయానికి.. చెల్లిస్తున్న పన్నులకు తేడా ఉన్నట్లు గుర్తించినట్లు ఐటీ వర్గాలు వివరించాయి. మల్లారెడ్డి ఇల్లు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో... కుమారులు, అల్లుడు ఇళ్లలో... విద్యాసంస్థలు, అస్పత్రులు కార్యాలయాల్లో, వాటికి సంబంధించిన డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలోనూ... తనిఖీలు నిర్వహించాయి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు సమన్లు జారీ చేసినట్లు తెలిపాయి. ఈ నెల28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని ఐటీ వర్గాలు ఆదేశించినట్లు వెల్లడించాయి. ఎక్కువ మంది ఉండటంతో కొందరికి వేరే తేదీల్లో వివరణ ఇచ్చేందుకు హాజరు కావాలని చెప్పాయి. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు.. తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అన్నింటిని అసెస్‌మెంట్ విభాగానికి అందజేయనున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు.