సౌర విద్యుదుత్పత్తి సంస్థ యాక్సిస్ ఎనర్జీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోని 20 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సాగిన తనిఖీల్లో కంప్యూటర్ హార్డ్ డిస్కులు, పెట్టుబడులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రధాన కార్యాలయంలో మొదలుపెట్టిన అధికారులు.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని 20 చోట్ల నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో గుడిమల్కాపురం పరిధిలోని చెట్టినాడ్ సిమెంట్ పరిశ్రమలోనూ ఐటీ సోదాలు నిర్వహించారు. చెన్నైలో నమోదైన సీబీఐ కేసులో భాగంగా చెట్టినాడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై దేశవ్యాప్తంగా పలుచోట్ల ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ బృందం పది గంటల పాటు సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పరిశ్రమ లావాదేవీలు, పలు పత్రాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: నేటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు