KTR Invited to Asia Berlin Summit 2023 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జూన్ 12 నుంచి 15వరకు జర్మనీలోని బెర్లిన్‌లో నిర్వహించనున్న ఆసియా-బెర్లిన్ సదస్సు 2023కు రావాలని కోరుతూ కేటీఆర్‌కు నిర్వహకులు ఆహ్వానం పంపారు. 'కనెక్టింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్' అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రసంగించాలని ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. జర్మనీ సెనేట్ డిపార్ట్‌మెంట్ ఫర్ ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఈ ఆహ్వానం పంపింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా తెలంగాణతో పాటు భారత్, ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను మరింత పటిష్ఠం చేయాలని కోరింది.
జర్మనీ, ఆసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు ఏటా ఈ సదస్సును నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్టప్‌లను ఆసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఏడాది సదస్సులో మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్‌టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను విస్తృతంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుందని, అద్భుతమైన ఆలోచనలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టం బలాన్ని... ఆసియా ఖండంలోని స్టార్టప్‌లతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్‌కు ఇటీవల వచ్చిన ఆహ్వానాలు: ఇదే మాదిరిగా అమెరికాలో జరిగే నీటి వనరుల సదస్సుకూ హాజరు కావాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్- ఎన్విరాన్మెంట్ల్ అండ్ వాటర్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ సదస్సు మే 21 నుంచి 25 వరకు హెండర్సన్ నేవడాలో జరగనుంది.
- ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. జూన్ 27 నుంచి 29వరకు.. చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగే ఈ సదస్సులో పాల్గొనాలంటూ.... ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు బోర్గె బ్రెండె కేటీఆర్‌కు లేఖ పంపారు. కేటీఆర్ ప్రణాళికతో... ఆవిష్కరణలు, కొత్త సాంకేతికల్లో దూసుకెళ్తోందని బ్రెండె ఆ లేఖలో ప్రశంసించారు.
- రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. కృత్రిమ మేధపై దుబాయ్‌లో జరగనున్న ప్రపంచ స్థాయి ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జూన్ 7, 8 తేదీల్లో దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్‌లో 'వరల్డ్ ఏఐ షో - మెనా 41వ గ్లోబల్ ఎడిషన్' జరగనుంది. ఈ షోకు ముఖ్య అతిథిగా రావాలని నిర్వాహణా సంస్థ ట్రెస్కాన్ కేటీఆర్‌ను ఆహ్వానించింది.
ఇవీ చదవండి: