ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుడు ఎం.రవీందర్ సన్‌పరివార్(sun pariwar) పేరిట ఓ సంస్థను ప్రారంభించాడు. దానికి సీఈవోగా వ్యవహరించాడు. ఇందులో రూ.లక్ష కడితే ప్రతి నెలా రూ.6 వేలు చెల్లిస్తారు. 25 నెలలు ముగిసిన తర్వాత అసలు రూ.లక్ష కూడా తిరిగి ఇచ్చేస్తానంటూ జోరుగా ప్రచారం చేశాడు. ఇలా.. ‘కలిస్తే గెలుస్తాం’ అంటూ అధిక వడ్డీ ఆశ చూపి రూ.150 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించారు. 2018లో సైబరాబాద్ పోలీసులు ఎం.రవీందర్‌తోపాటు ఈ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరించిన పులంగారి మౌనికను అరెస్ట్ చేశారు. ఛార్జీషీట్ కూడా దాఖలు చేశారు.
మళ్లీ ఇప్పుడెందుకు
ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి (అమీన్‌పూర్ ఎంపీపీ వియ్యంకుడు) తన నుంచి రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకుని.. తిరిగి ఇవ్వడం లేదంటూ తెల్లాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సీపీ సజ్జనార్‌కు మొరపెట్టుకున్నాడు. ఆ డబ్బుల్ని సన్‌పరివార్‌లో పెట్టుబడిగా పెట్టినట్లు అవతలి వైపు వ్యక్తి చెప్పినట్లు ఫిర్యాదులో వివరించారు. కేసు నమోదు చేసి.. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోడబ్ల్యూ) బదిలీ చేయాలంటూ ఆర్సీపురం పోలీసులను సజ్జనార్ ఆదేశించారు. ఈవోడబ్ల్యూ సిబ్బంది ఎంపీపీ వియ్యంకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిచ్చిన సమాచారం మేరకు ఎంపీపీ ఇంట్లో సోదాలు నిర్వహించగా సుమారు 100 పేజీల డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ‘సన్‌పరివార్’ కేసులో న్యాయస్థానం అటాచ్ చేసిన ఆస్తులను 10 నుంచి 15 మంది కలిసి విక్రయించినట్లు తేల్చారు. రూ.15 కోట్ల నగదు కూడా బయటపడినట్లు స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది.
ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు...
ఈ నెల 13న ఎంపీపీ వియ్యంకుడు నరేష్ చంద్ర, అతని కుమార్తె (ప్రస్తుతం పటేల్‌గూడ సర్పంచి) నితీష, అతని భార్య అనురాధ, కొడుకు అభిజిత్‌ను అరెస్ట్ చేసి మూడో కంటికి తెలియకుండా రిమాండ్‌కు తరలించారు. చిన్న కేసులకే ప్రెస్‌మీట్లు పెట్టి పోలీసులు హడావుడి చేస్తుంటారు. అలాంటిది న్యాయస్థానం అటాచ్ చేసిన ఆస్తులను విక్రయించినా బయటకు పొక్కనీయలేదు. 10 నుంచి 15 మంది ఉండగా.. ఈ నలుగురినే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నార్సింగిలోని ఎస్వోటీ కార్యాలయం కేంద్రంగా ఈ కేసు దర్యాప్తు సాగింది. అక్కడికి ఓ ప్రజాప్రతినిధి వెళ్లారు. మరో ప్రజాప్రతినిధి రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు వీరిద్దరికి ఈ కేసుతో సంబంధమేంటన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: accident : లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. 30 మందికి తీవ్ర గాయాలు