ఐటీ ఆధారిత సేవల్లో నగరానికి తిరుగులేదని జీహెచ్‌ఎంసీ ఓ వైపు ప్రకటిస్తూ.. పౌరసేవలే సరిగా నిర్వహించలేకపోతోంది. సాంకేతిక సమస్యను కారణంగా చెబుతూ కోటి మంది ఉన్న మహానగరంలో జనన, మరణ ధ్రువపత్రాల జారీని ఆపేసింది. ధ్రువపత్రాల కోసం కార్యాలయాలను ఆశ్రయిస్తున్న దరఖాస్తుదారులకు సంబంధిత సర్కిల్ ఏంఎంఓహెచ్(సహాయ వైద్యాధికారి)లు వారం నుంచి ఇదే సమాధానం చెబుతున్నారు.
కొత్త సాఫ్ట్‌వేర్ కాదు..
జనవరి మొదటి వారంలో జనన, మరణ ధ్రువపత్రాలకు సంబంధించి కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని జీహెచ్‌ఎంసీ చెప్పుకొచ్చింది. అందులో భాగంగా నెట్‌వర్క్ సమస్యలు వస్తున్నాయా అని అడిగితే.. అధికారులు కాదంటున్నారు. సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్), మీసేవ డైరెక్టరేట్లతో ఏర్పడిన నెట్‌వర్క్ సంబంధిత సమస్యలే కారణమని పరోక్షంగా చెబుతున్నారు. కేంద్ర కార్యాలయం ద్వారా మీసేవ డైరెక్టరేట్, జీహెచ్‌ఎంసీకి డిజిటల్ సేవలందించే సీజీజీతో చర్చలు జరుపుతున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు.
పౌరులకు ఇబ్బందులు..
పాస్‌పోర్టులు, జీవిత బీమాలు, విద్య, వ్యాపార సంబంధిత విషయాల్లో తల్లిదండ్రులు చిన్నారులకు జనన ధ్రువపత్రం తీసుకుంటారు. కుటుంబసభ్యులు మరణించిన వారికి మరణ ధ్రువపత్రం తీసుకుంటారు. అలా నగరవ్యాప్తంగా రోజుకు 500 బర్త్ సర్టిఫికెట్ల దరఖాస్తులు, 120 డెత్ సర్టిఫికెట్ల దరఖాస్తులు అందుతుంటాయి. అదే సంఖ్యలో జారీ అవుతుంటాయి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి.
ఇదీ చదవండి: ఎవరు కిడ్నాప్ చేశారో మాకు తెలుసు: ప్రతాప్రావు