ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిన్నరగా పనులు నామమాత్రంగానే ఉన్నాయి. కాంక్రీటు, మట్టి తవ్వకం పనుల్లో వేగంలేదు. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగులో ఉన్న బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. గుత్తేదారులు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఏ ప్రాజెక్టు ముందు చేపట్టాలి, ఏది తర్వాత చేపట్టాలి, ఏది అవసరం, ఏది అనవసరం అని తేల్చేసరికి 2019 డిసెంబర్ వచ్చింది.
గుత్తేదారులను పనుల వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తుండగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రాజెక్టుల్లో పనులు అక్కడే ఆగిపోయాయి. మరో వైపు కేవలం ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని లెక్కగట్టారు. ఆయా ప్రాజెక్టుల ప్రారంభించే తేదీలు సైతం ప్రకటించారు.
వెలిగొండ మొదటి టన్నెల్..
లక్ష్యం : 2020 సంవత్సరాంతం
డిసెంబరు నెలాఖరుకు టన్నెల్ పనులతో పాటు నీటి విడుదలకు అనువుగా కాలువలు, డ్యామ్‌లకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలి. అంటే రూ. 200 కోట్లకు పైగా విలువైన పనులు చేయాల్సి ఉంది. డిసెంబరు నెలాఖరులోగా పనులు చేయగలరా అనేది సందేహమే. టన్నెల్ హెడ్రెగ్యులేటర్లోనూ సీఎంసీడీ పనులు చేయాలి. 2,500 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉంది. మొత్తం టన్నెల్ పనులు దాదాపు 18 కిలోమీటర్లకు పైగా పూర్తయ్యాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు జరిగిన పనులను పరిగణనలోకి తీసుకుంటే మరో 400 మీటర్ల టన్నెల్ తవ్వాలి.
వంశధార -2 రెండో దశ
లక్ష్యం : 2021 మార్చి
మరో 15 శాతం పనులు పూర్తిచేయాలి. 3 ప్యాకేజీలుగా ఈ పనులు సాగుతున్నాయి. అన్ని ప్యాకేజీల్లో కలిపి 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు మిగిలి ఉన్నాయి. 87వ ప్యాకేజీలో పనులు పూర్తికి ఇంకా 60 ఎకరాలకు పైగా భూసేకరణ పెండింగ్‌లో ఉంది. 60 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని అయిదు నెలల్లో పూర్తి చేయగలరా అనేదే కీలకం. ప్రస్తుత వేగంతో పనులు జరిగితే లక్ష్యాన్ని చేరలేమని కొందరు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఇవన్నీ పూర్తి చేయడానికి మరో రూ.250 కోట్లు విలువైన పనులు చేయాల్సి ఉంది.
అవుకు టన్నెల్-2
లక్ష్యం : 2021 మార్చి
అవుకు టన్నెల్లో ఆగస్టులో దాదాపు 20 మీటర్ల భాగం ఆకస్మాత్తుగా కూలిపోయింది. దీనిపై నిపుణుల కమిటీ కొన్ని సూచనలిచ్చింది. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ పని ముందుకు సాగే అవకాశం ఉంది. కుడివైపు ట్యూబు తవ్వకం, లైనింగు పనులు చాలా వరకూ చేయాల్సి ఉంది. 160 మీటర్ల తవ్వకం పనులకు గాను 100 మీటర్లకు పైగా పెండింగులో ఉంది.
నెల్లూరు బ్యారేజి
లక్ష్యం : 2020 నవంబరు నెలాఖరు
కొన్ని పనులు కొత్త గుత్తేదారుకు అప్పజెప్పేందుకు వీలుగా ఏర్పాటుచేశారు. ఇంకా కాంక్రీటు పనులు దాదాపు 700 క్యూబిక్ మీటర్లు వరకు చేయాలి. పీసీసీ బ్లాకులు, పియర్ హాయిస్ట్ కాలమ్ పనులు చేయాల్సి ఉంది. మెకానికల్ పనులూ చాలా వరకూ పెండింగులో ఉన్నాయి. గేట్లు ఎత్తేందుకు సంబంధించిన పనులు పెండింగులో ఉన్నాయి. గడువులోగా ఈ పనులన్నీ పూర్తి చేసే పద్ధతి లేదు.
సంగం బ్యారేజి
లక్ష్యం : నవంబరు నెలాఖరు
మట్టి తవ్వకం, కాంక్రీటు పనులు కూడా మందగమనంలోనే ఉన్నాయి. ఇంకా సుమారు 5,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీటు పోయాల్సి ఉంది. బ్యారేజిలో మెకానికల్ పనులు పెద్ద ఎత్తున పెండింగులో ఉన్నాయి. 85 సర్వీసు గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా మూడొంతులుకూడా పూర్తి కాలేదు. స్టాప్ లాగ్ గేట్ల ఏర్పాటు పనులూ మందకొడిగానే సాగుతున్నాయి. గేట్లు ఎత్తేందుకు, దించేందుకు పూర్తి చేయాల్సిన మెకానికల్ పనులు పరిస్థితీ ఇంతే .
వంశధార- నాగావళి అనుసంధానం
లక్ష్యం : డిసెంబర్ చివరిలోగా
వంశధార నాగావళి అనుసంధాన పనులు రెండేళ్లలో సుమారు 70శాతం పూర్తయ్యాయి. మిగిలిన 30 శాతం పనులను మరో 2 నెలల్లో ఎంతవరకు చేయగలరనేది చర్చనీయాంశమవుతోంది. కాంక్రీటు పని 45 వేల క్యూబిక్ మీటర్లకు మించి పెండింగులో ఉంది. గడువు లోపు పూర్తి చేయాలనుకున్నదానికి తగ్గట్టుగా ప్రస్తుతం కాంక్రీటు పనుల వేగం లేదు. మట్టి పని కూడా 4.50 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు చేయాల్సి ఉంది. కట్టడాలి పనులు సగమే పూర్తయ్యాయి.