పీవీ గారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి?
చాలా గొప్పవిషయం, దేశంలో చెప్పుకోదగిన ప్రధానుల్లో పీవీ. నరసింహారావు గారు ఒకరు. ఆయన శతజయంతి వేడుక అందరి వేడుక. చాలా గొప్పగా నిర్వహించి తీరాలి. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న చంద్రశేఖర్ రావుగారి అభిప్రాయం చాలా సముచితమైనది. ప్రతివాళ్లు దాన్ని సమర్ధించాలి. పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. ఎందుకంటే 90వ దశకంలో భారతదేశం ఆర్ధికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అలాంటి సమయంలో ఆర్థిక సరళీకరణ విధానాలు తెచ్చి యువతరానికి కొత్త ఉద్యోగాలు రావడానికి కారణమయ్యారు. ఆయన ప్రభుత్వం మైనార్టీలో ఉన్నా చాలా ధైర్యం చేశారు. దూరదృష్టితో ఆలోచించి సాహసంతో ఆర్థిక విధానాలు తీసుకువచ్చిన వ్యక్తిత్వం ఆయనది. సమాజం గురించి నిరంతరం ఆలోచించారు. రైతులకు, యువతరానికి మేలు చేసేందుకు ప్రయత్నించారు. ఐదేళ్ల కాలంలో దేశంలో పెనుమార్పులు తీసుకువచ్చారు. అలాంటి ప్రధానిగా పీవీ ఒక్కరే కనిపిస్తారు. ఆయనను గౌరవించుకోవటం అంటే మనల్ని మనం గౌరవించుకోవటమే. ఆయనను తెలుగు రాష్ట్రాలకు, తెలుగు వారికే పరిమితం చేయకూడదు. ఆయన దేశానికి సేవ చేసిన ముఖ్యమైన ప్రధాని. పీవీగారికి భారతరత్న ఇవ్వాలి. సీఎం చంద్రశేఖర్ గారి ఆలోచన బాగుంది. దానిని అందరూ సమర్థించాలి.
ప్రధానిగా గంభీరంగా ఉండే పీవీ గారు సున్నితమైన కవిత్వాన్ని ఇష్టపడేవారు. అసలు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది... ? కుటుంబసభ్యులు, స్నేహితులతో ఎలా ఉండేవారు...?
తమ రంగంలో నిష్టాతులైన ప్రముఖ రచయితలు, ముఖ్యమైన నాయకులు... ఇతర రంగాలకు దూరంగా ఉండటం తప్పనిసరి అవుతుంది. నాకు తెలిసిన పీవీలో ఎన్నో ముఖాలున్నాయి. గంభీరమైన మనిషి, ఓర్పు ఉన్న వ్యక్తి. ఎవరూ చెప్పిన శ్రద్ధగా వింటారు. వారి మాటల నుంచి నేను ఏం నేర్చుకోగలను అనే నిరంతర జిజ్ఞాస, పిపాస ఆయనలో ఉంది. 80 ఏళ్ల వయసులో కొత్తగా వచ్చిన కంప్యూటర్‌పై ఆయన పన్నులన్నీ చేసుకునేవారు. అలాంటి వాళ్లు చాలా తక్కువ మనదేశంలో. ఈ పుస్తకంలోని తెలుగు స్కిప్ట్‌ను పీవీగారే కంప్యూటర్‌లో టైపు చేశారు. ఓర్పు, పట్టుదల కలగలిసిన అయన సాధారణంగా ఉండేవారు. ఆయన దగ్గర పెద్ద గ్రంథాలయం ఉండేది. రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే నాసాలో శాస్త్రవేత్తను అయ్యేవాడిని అనేవాళ్లు. ఆయనలోని బహుముఖ ప్రజ్ఞ, కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతుహలానికి ఈ పుస్తకమే ఉదాహరణ. సాహితీ రంగంతో ఆయనకు ముందు నుంచి పరిచయం ఉంది. కాకతీయ పత్రికను నడిపారు. రాజకీయాలంటే ఇష్టం. కాంగ్రెస్ పార్టీ ఆయనను దూరం పెట్టింది. ఆయనలో ఒంటరితనాన్ని నేను చేశాను. లేని అభియోగాలు మోపిన సందర్భంలోనూ ఆయన నోరు విప్పలేదు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవటం. ఉచితానుచితాలను కాలం నిర్ణయిస్తుందని నమ్మేవారు. సరిగ్గా అదే జరిగింది. ఆయనపై పార్టీ పెట్టిన ఆక్షేపణ ఏదీ నిలవలేదు కానీ ఆయన చేసిన ఆర్థిక విధానాలు నేటికి యువత మెచ్చుకునేలా చేశాయి. ఉద్యోగావకాశాలకు కారణమయ్యాయి. ఆయన నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్లే మనిషి. అదే ఆయన బలం కూడా.
మీరు రాసిన పుస్తకాన్ని పీవీగారు ఆంగ్లంలోకి అనువదించారు. మీ మధ్య ఉన్న పరిచయం వల్ల జరిగిందా ...? లేక ఆ పుస్తకం ఆయనపై అంతగా ప్రభావం చూపించిందా..?
ఆయనకు సాహిత్య పరంగా నవలలతోనే కానీ కవిత్వంతో అనుబంధం లేదు. విశ్వనాథ సత్యనారాయణగారి వెయ్యిపడగలను ‘సహస్రఫణ్’గా హిందీలోకి తెచ్చారు. ఆప్టే గారి మరాఠి నవలను తెలుగులోకి తీసుకుని వచ్చారు. తెలుగు, మరాఠిలో అనువాదకుడిగా పీవీగారు పనిచేశారు. కవిత్వంపై పని చేయలేదు. నా కవిత్వం ఆయన దగ్గరకు వెళ్లింది. హైదరాబాద్ వచ్చినప్పుడు కబురు పెడితే వెళ్లి కలిశాను. ప్లబ్ ఆఫ్ వైజాగ్ పట్టణం అనే పుస్తకం ఆయనకు బాగా నచ్చింది. అందులో వాడిన భాష, ఉపమానాలు బాగా నచ్చాయి. అలా పరిచయం కలిగిన తరువాత ఆయన పుస్తకం ఇన్‌సైడర్‌ను సంతకం చేసి నాకు ఇచ్చారు. అభిప్రాయం చెప్పమని అడిగారు. విమర్శకురాలిగా నిక్కచ్చిగా ఉండే నేను కొంత కాలం వాయిదా వేశాను. ఆయన ఫోన్ చేసి పుస్తకంపై అభిప్రాయం చెప్పేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగారు. ప్పక వారం రోజుల్లో పుస్తకం పూర్తి చేశాను. నవల మాదిరే ఆసక్తిగా సాగుతుంది.. ఆ పుస్తకం. రాజకీయ రంగంలో ఉండే ఒడిదొడుకులు, వెన్నుపోట్లు, గోతులు, కుట్రలు వంటి అంశాల్ని బాగా చిత్రీంచారు. అదీ ఆయన ఆత్మకథ లాంటింది. రాజకీయాలంటే ఇలా ఉంటాయా అని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఆ పుస్తకం గురించి నా అభిప్రాయాన్ని చెప్పాను. చాలావరకు ఆయన ఏకీభవించారు. తెలుగులో స్త్రీల తరపున గాఢమైన ప్రేమ కవిత్వం లేదు అప్పటికీ. నేను రాయటం మెుదలుపెట్టాను. ఉదయంలో పత్రికలో వారం వారం వచ్చింది. అదీ చాలా కాలం అయిపోయింది. ఈ పుస్తకం ఆయనకు బాగా నచ్చింది. ఆంగ్లంలో అనువదిస్తే బాగుంటుంది అన్నారు. కానీ తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేసేవారు దురదృష్టం కొద్దీ చాలా తక్కువ. ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదించేవారు మాత్రం ఉన్నారు. సత్యనారాయణగారి వెయ్యిపడగలు పీవీ గారి వల్లే ‘సహస్రఫణ్ ’గా హిందీలోకి వెళ్లింది. ఆయన గురించి సాహితీ ప్రపంచానికి తెలిసింది. చాలా మంది తెలుగు కవులున్నావారి గురించి తెలియకపోవటానికి ఇదే కారణం. మనం శ్రీశ్రీ మహాప్రస్థానం అనువాదానికి లొంగదు. ఆయనకు భావ కవిత్వం వరకు పరిచయం ఉంది కానీ ఆధునిక కవిత్వంతో పరిచయం లేదు. నాతో మాట్లాడుతున్నప్పుడు సహ రచయితతో మాట్లాడుతున్న వాతావరణమే ఉండేది తప్పా ఆయన పూర్వ ప్రధాని అనే భావనతో ఉండేవారు కాదు.
రచయితలుగా మీ మధ్య ఎలాంటి సంవాదం జరిగేది. పీవీగారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది...?
పీవీగారు దిల్లీ నుంచి వచ్చి గెస్ట్‌హౌస్‌లో ఉన్నప్పుడు నేను అక్కడకు వెళ్లేదాన్ని. దిల్లీ వెళ్లినప్పుడు మోతీ మార్గ్‌లో కలిసేదాన్ని. ఒంటరిగా ఉండటం వల్ల ఆసక్తికరమైన అంశమైన సాహిత్యంపై దృష్టిపెట్టారు. నేను కవితల్ని ఆయన కోరిక మేరకు చదివి వినిపించటం జరిగేది. ఆయనకు బాగా ఆకర్షణ కలిగింది. అనువాదంపై దృష్టి పెట్టారు. మెుదట డ్రాఫ్ట్ తయారుచేశారు. తుది డ్రాఫ్ట్‌కు తొలి డ్రాఫ్ట్‌కు మధ్య మూడు నాలుగు డ్రాఫ్ట్‌లు మారి ఉంటాయి. బాగా శిల్పంలా తీర్చిదిద్దారు. ఇందులో విశ్వనాథ సత్యనారాయణ, దిలీపే చిత్రే సహకారం ఉంది. ఈ పుస్తకాన్ని పీవీగారు బాగా ఓన్ చేసుకున్నారు. నేను చేసిన కృషిలాగా అనువాదికుడిగా ఆయన చాలా కృషి చేశారు. ఇందులోని వ్యాక్యాలను అనర్గళంగా చెప్పగలిగే వారు. ఆయన ధారణశక్తి చాలా గొప్పది. చిన్ననాటి విషయాల్ని సైతం అప్పుడే జరిగిన వాటిగా చెప్పగలిగే అంతటి ఆయన జ్ఞాపకశక్తి నన్ను ఆశ్చర్యపరిచింది.
పీవీగారికి, మీకు మధ్య ప్రస్తావనకు వచ్చిన ఏదైనా ఒక సంఘటన గురించి చెప్పండి..?
అనేక రకాల అంశాలపై కబుర్లు చెప్పుకునేవాళ్లం. అయితే సాహిత్య వ్యక్తీకరణపై ఆయనకు బలమైన అభిప్రాయం ఉంది. ఒక భాష నిర్మాణం, వ్యక్తీకరణం ఒకలాగా ఉంటుంది. మరో భాషలోకి అనువాదించేటప్పుడు మరోలా ఉంటుంది. తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదించేటప్పుడు తెలుగు భాష వ్యక్తీకరణ వేరుగా ఉంటుంది. ఆంగ్ల భాష వేరుగా ఉంటుంది. అన్నీ అనువాదానికి లొంగవు. అలాంటప్పుడు ఆయన పాటించిన నిబంధనలు, పడిన ఇబ్బందులు, సూత్రాలు, కష్టాలను ఈ పుస్తకంలో ముందు మాటలో రాశారు. కవిని ఎప్పుడూ అనువాదకుడు అతిక్రమించకూడదనేది ఆయన అభిప్రాయం.
ప్రజా జీవితంలో ఉన్నవారికి కుటుంబంతో గడిపే సమయమే తక్కువ. అలాంటిది ఆయన ఎక్కువ పుస్తకాలు చదివేవారని అంటున్నారు...? పీవీగారు ఎలాంటి పుస్తకాల్ని ఎక్కువగా చదివేవారు...?
ఆయనకు లా అంటే ఆసక్తి. సాహిత్యమంటే కొంతమేరకు ఇష్టం. పత్రికలకు వ్యాసాలు రాసేవారు. సొంత పేరుతోనే కాక మారుపేరుతోనూ రాశారు. ఆయన చాలా గుంభనంగా ఉండే మనిషి, అంచనా వేయడం కష్టం. ఆయన రాజకీయ ఉపన్యాసాల్లో చాలా నిమ్మలంగా కనిపించినా.. నిర్ణయాలు చాలా గట్టిగా ఉండేవి. తన జ్ఞానాన్ని మొత్తం దేశం కోసమే అనేక రకాలుగా ఉపయోగించారు.
రాజకీయాల నుంచి కాస్తదురంగా ఉన్న సమయంలోనే పీవీ గారు అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సివచ్చింది.వాటి గురించి ఎప్పుడైనా మీతో చర్చించారా?
ఆయన చేయని చాలా విషయాలకు ఆయన బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. పీవీ ఎంతో రుజువర్తనం ఉన్న నాయకుడు. అందుకే ఆయనపై అన్ని ఆరోపణలను కోర్టు కొట్టి వేసింది. కాంగ్రెస్ పార్టీ ఆయనను చాలా బాధపెట్టింది. రాజకీయంగా ఒంటరి చేయాలని సోనియా గాంధీ భావించినప్పటికీ.. వ్యక్తి కంటే పార్టీ, పార్టీ కంటే దేశం గొప్పదనే ఉద్దేశంతోనే ప్రవర్తించారు. స్వగ్రామంలో రైతుగా స్థిరపడాలనేది ఆయన తీరని కోరిక. కానీ అప్పట్లో నక్సలైట్ ఉద్యమం అనంతరం వాళ్ల భూములు ఆక్రమణకు గురవడంతో అది నేరవేరలేదు. ఆ తరువాత హైదరాబాద్‌కు రావడమే తప్ప స్వస్థలానికి దాదాపుగా వెళ్లలేదు. వ్యవసాయంపై మక్కువతోనే భూ సంస్కణల చట్టం తీసుకువచ్చారు. మొదటగా ఆయన సొంత భూములనే ప్రజలకు పంచి పెట్టారు.
పీవీ గారి లాంటి మహనీయుడికి చివరి దశలో కూడా సముచిత గౌరవం దక్కలేదనేది ప్రతి ఒక్కరి నోటా వినిపించే మాట. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
అప్పటిదాకా గాంధీ,నెహ్రూ కుటుంబాల ప్రభావంతోనే నడుస్తున్న కాంగ్రెస్ పార్టీలో బయటివ్యక్తిగా ఆయన అన్ని మంచి పనులు చేయడం వాళ్లకు ఇబ్బందిగా మారింది. అందుకే పీనీ అంటే ఒకరకమైన కోపం ఉండేది. పార్టీలో చాలా మందికి పీవీ అంటే ఉన్నతగౌరవం ఉన్నా సోనియా గాంధీకి భయపడి వాళ్లు ఏమీ మాట్లడలేక పోయేవారు. కాంగ్రెస్ పార్టీ పీవీకి అన్యాయం చేసిందనేది వాస్తవం. కానీ ప్రజలు ఈయనకు బ్రహ్మరథం పట్టారు. ఆఖరి రోజుల్లో ఎంతో మంది ఈయనపై అసత్యప్రచారాలు చేయాలని చూసినా అవి సాగలేదు. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమేనని.. సీతాపతి వంటి చాలా పుస్తకాల్లో ఆధారాలతో సహా నిరూపితమైంది. సమకాలీకులు లెక్కచేయకపోయినా యువతరం నుంచి ఆయనకు చాలా అభిమానం లభించింది. న్యూయార్క్‌లో జరిగిన ఓ సాహితీ సమావేశానికి వెళ్లాం. పీవీ అక్కడే ఉన్నారు. నాటి ప్రధాని వాజ్‌పేయ్ కూడా అక్కడికి వచ్చారు. ఆ నగరంలోని భారతీయులంతా పీవీని చూడగానే వెంటనే వచ్చి పాదాభివందనం చేశారు. మీ వల్లే మేం ఇక్కడ ఉద్యోగాలు చేయగలుగుతున్నామంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో ఆయనకు అంతటి ఆదరణ ఉంది. పీవీకి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ ఇవ్వలేదు. ఆయన మరణించినపుడు కూడా పార్టీ చూపించిన నిరరాదరణను దేశ ప్రజలెవరూ మరచిపోలేరు. భారత అత్యున్నత పురస్కారం ద్వారా పీవీ నరసింహారావుగారిని గుర్తించుకోవడం అనేది ప్రస్తుతం ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యక్తుల కనీస బాధ్యత. ఆయనకు భారతరత్న ఇవ్వాలని నేను గాఢంగా ఆశిస్తున్నాను.
ఇదీ చూడండి: పీవీకి సరైన గౌరవం దక్కలేదా? వంగర వాసులు ఏమంటున్నారు?