దుబ్బాక ఓటమిపై తెరాసలో అంతర్మథనం మొదలైంది. రాష్ట్రావిర్భావం తర్వాత ఉప ఎన్నికల్లో మొదటి సారి ఓటమి ఎదురు కాగా... అన్ని కోణాల్లో ఆరా తీస్తోంది. వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్న తెరాస లోతుగా విశ్లేషించి పరిస్థితులను చక్కదిద్దాలని భావిస్తోంది. ముఖ్యంగా రానున్న జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎన్నికలపై ప్రభావం పడకుండా దిద్దుబాటు చర్యలకు కసరత్తు చేస్తోంది.
ఆత్మపరిశీలన...
వరుస విజయాలతో ఊపు మీద ఉన్న గులాబీ పార్టీ... దుబ్బాక ఓటమితో ఆత్మపరిశీలన ప్రారంభించింది. ఊహించని ఫలితం రావడం వల్ల తెరాస శ్రేణులు తీవ్ర నిరాశకు, దిగ్భ్రాంతికి గురయ్యారు. దుబ్బాకలో అసలేం జరిగిందనే విషయాలపై లోతుగా సమీక్షించేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభమైంది.
సమగ్ర పరిశీలన...
తెరాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. పార్టీ ఇంఛార్జీలుగా వ్యవహరించిన నేతలను నివేదికలు అడిగినట్లు తెలుస్తోంది. సొంత పార్టీలో బలహీనతలు, భాజపాకు అనుకూలించిన అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలని తెరాస నాయకత్వం నిర్ణయించింది. లోతుగా సమీక్షిస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొనగా... ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
లోతుగా విశ్లేషణ...
దుబ్బాక ఓటమిపై అన్ని వర్గాల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించి లోతుగా విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అవసరమైతే కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తెరాస వ్యూహాలు...
దుబ్బాక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పార్టీ, ప్రభుత్వం పరంగా అవసరమైన మార్పులు, చేర్పులు కూడా జరగవచ్చవని చెబుతున్నారు. దుబ్బాక ఓటమి ప్రభావం పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపకుండా వెంటనే చర్యలు చేపట్టేలా తెరాస వ్యూహాలు రూపొందిస్తోంది. రానున్న జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎన్నికల్లో దుబ్బాక ఓటమి ప్రభావం చూపకుండా జాగ్రత్తలు పడుతోంది.
ప్రభుత్వ పరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేసేలా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. త్వరలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: అశ్రునయనాల మధ్య వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు