ప్రశ్న: కోవిడ్-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల స్తృహ పెరిగిపోయింది. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి కోడి గుడ్లు, కోడి మాంసం ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అనుకోవచ్చా?
జవాబు: తప్పకుండా... గుడ్ల ఉత్పత్తి, వినియోగం వల్ల రైతులే కాదు... ఉపాధి, ఉద్యోగాల కల్పన పెరుగుతుంది. ప్రత్యేకించి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి గొప్ప ఊతం ఇచ్చినట్లువుతుంది. తల్లి పాల తర్వాత బిడ్డకు గుడ్డు అత్యంత ప్రయోజనకారి అని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయంటే... గుడ్డు ఎంత పుష్కలమో అర్థం చేసుకోవచ్చు. కొవిడ్-19 అనేది దురదృష్టకర పరిణామమే అయినా... మంచి ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి ప్రాధాన్యత ప్రజలకు తెలియడం శుభపరిణామం.
ప్రశ్న: గుడ్ల విలువ మార్కెట్‌లో 6 నుంచి 7 రూపాయలు వెళ్లింది. ధరలు తగ్గించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
జవాబు: రెండేళ్లుగా ఫౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో నడుస్తోంది. కరోనా ఆరంభం సమయంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో... గుడ్లపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన దుష్ప్రచారాల వల్ల ఫౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ దశలో గుడ్డు రూ.1కు అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది. ఆ నష్టం ఇప్పుడు భర్తీ చేసుకోవాల్సిన సమయం ఇది. ధర ఎక్కువైందని కొందరు అంటున్నారు వాస్తవమే. ఇది కనీసం మరో ఐదారు మాసాలపాటు నడిస్తే తప్పా... రెండేళ్లుగా పరిశ్రమలకు తగిలిన దెబ్బ, కరోనా నష్టాల నుంచి బయటపడలేం. ఈ దశలో ప్రభుత్వం, బ్యాంకుల మద్ధతు ఉంటే... మళ్లీ పరిశ్రమ కోలుకుంటుంది.
ప్రశ్న: తెలుగు రాష్ట్రాల్లో ఫౌల్ట్రీ పరిశ్రమకు ఎంత నష్టం వాటిల్లింది? ఇప్పుడు కోలుకున్నట్లేనా?
జవాబు: కరోనా నేపథ్యంలో ఇప్పుడు పరిశ్రమ దిశ తిరిగింది. మరో మూడు, నాలుగు మాసాలు ఇదే కొనసాగితే పరిశ్రమ కోలుకుంటుంది. ప్రస్తుతం గుడ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దానిలో సందేహమే లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే బాగా వినియోగం పెరిగడంతో... తమకు గుడ్లు దొరకడం లేదు... పంపండి అంటూ ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్స్ వస్తున్నాయి. త్వరలో పరిస్థితి సర్దుకుంటుందని ఆశిస్తున్నాం. కరోనా సమయంలో ఆరు మాసాలపాటు బ్యాంకులు మారిటోరియం విధించి ఆదుకున్నా... ఇప్పుడు మళ్లీ అప్పులు చెల్లించాలంటూ వెంటపడుతున్నాయి. ఈ క్లిష్టపరిస్థితుల్లో అప్పుల చెల్లింపుల విషయంలో బ్యాంకులు కొంత మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న: భారత్‌లో పౌష్టికాహార లోపం గణనీయంగా ఉంది. చిన్నారులు, గర్భిణీ స్త్రీలల్లో ఈ లోపం అధికంగా చూస్తున్నాం. అధిగమించేందుకు అవకాశం గల గుడ్డు వినియోగం పెంచడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు?
జవాబు: దేశంలో 40 శాతం పిల్లలు ఉండాల్సిన ఎత్తు, పొడవు ఉండటం లేదు. గర్భిణీ స్త్రీలు 50 శాతానికి పైగా పౌష్టికాహారం లోపం కారణంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి అధిగమించాలంటే... కనీసం వారానికి మూడు, నాలుగు గుడ్లు తిన్నా సరిపోతుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీ మహిళలకు గుడ్లు సరఫరా చేయమని పరిశ్రమపరంగా అడుగుతున్నాం. స్పందించిన తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయి.
ప్రశ్న : కోడి గుడ్డులో బహుళ పోషకాలు ఉన్నా... ఓ అపోహ కూడా ఉంది. గుడ్లలో పచ్చ సొనను చాలా మంది పారేస్తున్నారు. ఈ అపోహలపై మీరు ఇచ్చే భరోసా ఏంటి?
జవాబు: గుడ్డులో మొత్తం మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్డులో తెల్లసొన, పచ్చసొన అని రెండు భాగాలు ఉంటాయి. తెల్లసొనలో 8 మాంసకృత్తులు ఉంటాయి. అదే పచ్చసోనలో 4 మాంసకృత్తులు ఇమిడి ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్ అన్నీ పచ్చసొనేలో ఉంటాయి. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటే... పచ్చసొనలో 3, తెల్లసొనలో 3 గ్రాములు చొప్పున ఉంటుంది. మనిషికి కావాల్సిన డీ, బీ12, కే అన్నీ... పచ్చసొనలోనే ఉంటాయి.
ప్రశ్న: కరోనా యువత, విద్యావంతులు, పట్టభద్రులు, ప్రైవేటు ఉద్యోగులు సైతం వ్యవసాయంతోపాటు పౌల్ట్రీ రంగంలోకి వస్తున్నారు. వీరికి మీరు ఎలాంటి సహకారం అందిస్తున్నారు?
జవాబు: ఐటీ కంపెనీల్లో దాదాపు 17 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అదే సమయం, క్రమశిక్షణ పాటించినట్లైతే... ఫౌల్ట్రీ రంగంలో కూడా రాణించవచ్చు. రాబోయే 20 ఏళ్లల్లో ఈ రంగం 600 నుంచి 800 శాతం వృద్ధి సాధించబోతోంది. ఇది గ్యారంటీ. ఈ రంగంలోకి కొత్తగా అడుగు పెట్టే యువతరానికి స్వాగతం. యువత నుంచి మేము కూడా నేర్చుకుంటాం. కలిసి ముందుకు వెళతాం.
ప్రశ్న: ఐఈసీ అధ్యక్షుడిగా పదవీ కాలం ఏడాది గడిచిపోయింది. మీ నిర్దేశిత భవిష్యత్ లక్ష్యాలు ఏంటి?
జవాబు: కొవిడ్ కొత్త అనుభవాలు నేర్పింది. మొదట భయం, అయోమయం... అసలు ఎటు వెళుతున్నామో తెలియని పరిస్థితి ఏర్పడింది. భారత్‌లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో గుడ్డు ఎందుకు తినాలి? ఎంత అవసరం... అనే అంశంపై అంతర్జాతీయ గుడ్డు కమిషన్ ఆధ్వర్యంలో ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమాచారం భారత్ సహా మిగిలిన దేశాలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం.
ఇదీ చూడండి: వరల్డ్ ఎగ్ డే: గుడ్డు.. భలే మంచి ఫుడ్డు...!