హైదరాబాద్‌లోని జియాగూడలో బాబు, సరితలకు ఇద్దరు సంతానం. వీరిలో చిన్నవాడైన సంపత్.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అనుకోకుండా మైక్రో ఆర్ట్‌ను ప్రారంభించిన అతను... మెల్లిగా దానిలో ప్రావీణ్యం సాధించాడు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా... తన ప్రతిభతో అవార్డులను సైతం సాధించాడు. ఏ గురువు లేకుండా... పద్నాలుగు నెలల్లోనే అవార్డులను పొందాడంటే ఆశ్చర్యపోవాల్సిందే.
సంపత్ ఇప్పటి వరకు చాక్ పీస్ పైన, 0.5 ఎం.ఎం పెన్సిల్ లెడ్ పైన ఆంగ్లం ఏ నుంచి జడ్ వరకు అక్షరాలు రాశాడు. చాక్ పీస్‌పై వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, ఈఫిల్ టవర్, చార్మినార్, తాజ్ మహల్, కేథరినాథ్, అయోధ్య బొమ్మలకు ప్రాణం పోశాడు. కోడిగుడ్డు షెల్ మీద కూడా అనేక బొమ్మలను గీశాడు. 28 జులై 2020న క్రెడెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను, 15 నవంబర్ 2020న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌ను, 5 జనవరి 2021న బ్రేవో బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్‌ను సాధించాడు. త్వరలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డును సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఈ కళలో మరిన్ని శిఖరాలకు చేరుకునేందుకు తనకు మైక్రోస్కోప్ కావాలని... దాతలు, రాజకీయ వేత్తలు తనకు సహాయం చేయాలని సంపత్ కోరుతున్నాడు. మైక్రోస్కోప్ ఉంటే తను మరిన్ని కళాఖండాలు సృష్టించగలననే నమ్మకముందని పేర్కొంటున్నాడు.
ఇదీ చూడండి: బుడతడు.. ఆంగ్లంతో ఓ ఆట ఆడేశాడు!