ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రథమ సంవత్సరంలో 4 లక్షల 80వేల 555 మంది పరీక్ష రాయగా... 60.01 శాతం అనగా 2 లక్షల 88వేల 383 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే 1.24 శాతం ఉత్తీర్ణత పెరిగింది. మొదటి సంవత్సరంలో ఈ ఏడాది కూడా బాలికలు పైచేయి సాధించారు. బాలికలు 67.47 శాతం ఉత్తీర్ణులు కాగా... బాలురు 52.30 శాతమే ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికంగా లక్షా 49 వేల 38 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో పెరిగిన ఉత్తీర్ణత
ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత గణనీయంగా పెరిగింది. గతేడాది 65.01 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 68.86 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ బోర్డు చరిత్రలోనే ఇది రికార్డు స్థాయి ఉత్తీర్ణత అని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 4 లక్షల 11 వేల 631 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా... వారిలో 2 లక్షల 83 వేల 462మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. రెండో సంవత్సరం పరీక్షల్లోనూ బాలికలు సత్తా ప్రదర్శించారు. బాలికలు 75.15 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 62.10శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ ఉత్తీర్ణులైన వారిలో ఎక్కువ మంది ఏ గ్రేడ్ సాధించారు.
త్వరలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ప్రకటన
మెమోలు ఈనెల 22 వరకు ప్రిన్సిపల్స్‌కు చేరుతాయని అధికారులు తెలిపారు. ఏవైనా తప్పులు ఉంటే.. జులై 17 లోగా ప్రిన్సిపల్స్ ద్వారా తెలపాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రీ కౌంటింగ్, జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ కోసం రేపటి నుంచి ఈనెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు పేర్కొంది. రీకౌంటింగ్ కోసం వంద రూపాయలు, జవాబు పత్రాల నకలు, రీ వెరిఫికేషన్ కోసం 600 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మొదటి రెండు స్థానాల్లో నిలవగా.. మెదక్ జిల్లా చివరి స్థానంలో ఉంది. మొదటి సంవత్సరంలో మేడ్చల్, రంగారెడ్డి మొదటి, రెండు స్థానాల్లో నిలవగా.. మెదక్ చివరి స్థానంలో నిలిచింది.
ఫెయిలైన వారు ఒత్తిడికి లోనవ్వద్దు
ఫలితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే www.bigrs.telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ఫలితాల ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యదర్శి కోరారు ఏదైనా సహాయం అవసరమైతే కళాశాలలోని కౌన్సిలర్‌ను లేదా బోర్డులోని మానసిక నిపుణులును సంప్రదించాలని వారు సూచించారు.
ఇవీ చూడండి: రైతుబంధు పంపిణీపై అధికారులతో సీఎస్ సమీక్ష