లాక్ డౌన్ ఎత్తివేయగానే తగిన జాగ్రత్తలు తీసుకుని మూల్యాంకనం ప్రారంభిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. మే నెలాఖరు వరకు ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అదనపు కేంద్రాలు, సిబ్బందితో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గదుల్లో జవాబు పత్రాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.ట
అవన్నీ ఒట్టి మాటలే...
ఈ ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండబోవని సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోందని విషయాన్ని కొట్టిపడేశారు. ఎప్పటి లాగే సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అందరిని అప్ గ్రేడ్ చేస్తారన్న ప్రచారం కూడా వాస్తవం కాదని... అది సాధ్యం కూడా కాదని జలీల్ తెలిపారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఆన్లైన్లో ఎంసెట్, జేఈఈ, నీట్ కోచింగ్ ఇస్తున్నామంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి నగేష్ చారి ముఖాముఖి.
ప్రశ్న : లాక్ డౌన్ కారణంగా ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ నిలిచిపోయింది. వాల్యేషన్ ప్రక్రయను తిరిగి ఎప్పుడు మెుదలుపెట్టనున్నారు ? ఫలితాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు ?
జవాబు : ఇంటర్ పరీక్షలు దాదాపుగా పూర్తయ్యాయి. ఒక పేపర్ మాత్రమే మిగిలిపోయింది. వారికి ఒక్క రోజులో పరీక్ష నిర్వహిస్తాం. లాక్ డౌన్ కారణంగానే మూల్యాంకనం ఆగిపోయింది. మే నెలాఖరున ఫలితాల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రశ్న : గత మూల్యాంకనంలో ఇబ్బందులు తలెత్తాయి. అలాగే సాంకేతికత సమస్యలతో ఫలితాలు తారుమారయ్యాయి. దీన్ని ఈసారి ఏ విధంగా అధిగమిస్తారు ?
జవాబు : గతేడాది సాఫ్ట్ వేర్ వల్లే ఫలితాల్లో ఇబ్బందులు వచ్చాయి. ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. మూల్యాంకనంలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా ఫలితాలు విడుదల చేస్తాం.
ప్రశ్న : ఇప్పటికే ఫలితాలు ఆలస్యంగా వస్తున్నందున అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండబోవని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. దీనిపై మీ స్పందన ఏమిటి ?
జవాబు : అదంతా తప్పుడు సమాచారమే. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా పరీక్షలు ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఇంప్రూవ్ మెంట్ కోసం ఈసారి కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నాం.
ప్రశ్న : ఒత్తిడిని అధిగమించేందుకు విద్యార్థుల కోసం గతంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు. ఆ ప్రక్రియ ఎంత వరకు వచ్చింది ? ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ?
జవాబు : పరీక్షల ముందు ప్రతి కళాశాలలో ఒక స్టూడెంట్ కౌన్సిలర్‌ను ఏర్పాటు చేయించాం. ఆయా కళాశాల నుంచే వారి ఎంపిక జరిగింది. వాళ్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు సలహాలు , సూచనలు ఇస్తూనే ఉన్నారు.
ఇవీ చూడండి : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న కరోనా.. 33వేలు దాటిన మృతులు