Intellectuals On Amaravathi Capital: ఆంధ్రప్రదేశ్ 'అమరావతిపై హైకోర్టు తీర్పు-సర్కారు తీరు' అనే అంశంపై విజయవాడలో మేధావుల చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, కమలానంద భారతి, జస్టిస్ గోపాలగౌడ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, మూడు రాజధానుల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వంపై ధిక్కరణ కేసు పెట్టాలి: రాజధానిని ఓ కులానికి అంటగట్టి మాట్లాడటం చాలా శోచనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలరావు వ్యాఖ్యానించారు. అసలు రాజధానికి ఎక్కువ భూములు ఇచ్చిందే ఎస్సీ, బీసీ మైనారిటీ రైతులన్న ఆయన.., అలాంటి వారిని ఇబ్బంది పెడతారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 20 వేల మంది రైతులు ఎకరంలోపున్న తమ భూములను రాజధానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇక్కడ రాజధాని లేకుండా చేయటం ప్రభుత్వతరం కాదని స్పష్టం చేశారు. హైకోర్టు తమ తీర్పులో ప్రభుత్వ తీరును ఎండగట్టిందని, ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా.. ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.
చారిత్రక ప్రదేశాన్ని రాజధానిగా నిర్ణయించడానికి అప్పటి ప్రభుత్వం ఎన్నో చర్చల తర్వాత నిర్ణయించిందని అన్నారు. గుంటూరు-విజయవాడల మధ్య ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా నిర్మించాలని తీర్మానించారన్నారు. ఎన్నో విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అమరావతికి తరలి వచ్చాయని తెలిపారు. తాత్కాలికం అని చెప్పినా.. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ అన్ని అక్కడి నుంచే పని చేస్తున్నాయన్నారు. అభివృద్ధి అంటే ఆర్థిక ప్రగతి, వైద్యం, విద్యా తదితర మౌలిక సదుపాయాలు, ప్రజలు నివాసం ఉండాలన్నారు.
"రాజధానికీ కులం అంటగట్టి మాట్లాడటం చాలా శోచనీయం. రాజధానికి ఎక్కువ భూములు ఇచ్చిందే ఎస్సీ, బీసీ మైనారిటీ రైతులు. భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందిపెట్టడం భావ్యమా ?. 20 వేలమంది రైతులు ఎకరం లోపు ఉన్న తమ భూములను రాజధానికి ఇచ్చారు. అమరావతిలో రాజధాని లేకుండా చేయడం ప్రభుత్వ తరం కాదు. హైకోర్టు తీర్పులో ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మంత్రులంతా రాజీనామా చేయాలి. రైతుల పోరాటం గుర్తించి ప్రధాని మోదీ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు తీర్పుపై ఇప్పటివరకూ సీఎం జగన్ దృష్టి పెట్టినట్టు లేదు. తీర్పును ఉల్లంఘిస్తున్న ప్రభుత్వంపై ధిక్కరణ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా." -గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి
రైతులను ఇబ్బందిపెట్టడం భావ్యమా ?: అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు చాలా అంశాలను బేరీజు వేసిన తర్వాత ఇచ్చిందని తెలంగాణకు చెందిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. నాలుగేళ్ల క్రితం అమరావతి నిర్మాణ సమయంలో వచ్చానని.. ఇప్పటికీ ఒక్క భవనం కూడా పూర్తి కాకపోవటం శోచనీయమన్నారు. పార్టీ మారితే ప్రభుత్వ నిర్ణయాలు ఎలా మారిపోతాయని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విచారణ చేయాలి కానీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరో తప్పు ఎలా చేస్తుందని నిలదీశారు. కోర్టు తీర్పును ప్రభుత్వమే అమలు చేయకపోతే ప్రజలు ఎలా విశ్వసిస్తారని అన్నారు. వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేయకూడదని హితవు పలికారు. చరిత్రను లిఖిస్తే ప్రభుత్వ నిర్ణయం అందులో తప్పుగానే నమోదు అవుతుందని పేర్కొన్నారు.
"హైకోర్టు చాలా విషయాలు ఆలోచించే తీర్పు ఇచ్చింది. ఆషామాషీగా హైకోర్టు తీర్పు ఇవ్వలేదు. అమరావతి నిర్మాణాల్లో ఏమాత్రం కదలిక లేదు. గతంలో పూర్తయిన భవనాలనూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత ప్రభుత్వమూ కొనసాగించాలి. ప్రభుత్వం శాశ్వతం.. పార్టీలు కాదు. ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో విశ్వసనీయత చాలా ముఖ్యం. భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందిపెట్టడం భావ్యమా ?". -ప్రొఫెసర్ హరగోపాల్
రాజధానిని కులం పేరుతో ఎలా ముడిపెడతారు: ఒక రాష్ట్ర రాజధానిని కులం పేరుతో ఎలా ముడి పెడతారని ఆధ్యాత్మికవేత్త కమలానంద భారతి నిలదీశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో అనుకూలమని తెలిపారు. ఏపీకి రాజధాని లేకుండా బిల్లును ఒప్పుకోవడం భాజపా తప్పు అయితే.., పార్లమెటులో నిర్ణయం చేయడం కాంగ్రెస్ చేసిన తప్పని అన్నారు. గతంలో ఆంధ్రను 66 వంశాల వారు పరిపాలించారని.., రాజధానిని ఒక్కటిగా కలిపి ఉంచలేకపోతే 3 ముక్కలు కాదు.. 36 ముక్కలు అవుతుందన్నారు. పోలవరం ప్రాజక్టును, అమరావతి రాజధానిని నిర్మించే బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. గ్రామదేవతల దీవెనలు, మృత్తిక, శాస్త్రోక్తంగా ఇటుక పెట్టిన ప్రాంతంగా రాజధాని ఎక్కడికి పోదని ఆయన స్పష్టం చేశారు.
"ఒక రాష్ట్ర రాజధానిని కులం పేరుతో ఎలా ముడిపెడతారు.. కేంద్రం ఏపీ సీఎంను పెద్దకుమారుడిగా చూస్తోంది. రాజధాని లేకుండా రాష్ట్రం ఇవ్వొచ్చని కేంద్రం రుజువు చేసింది. రాజధాని లేకుండా పాలన చేయొచ్చని ఇక్కడి ప్రభుత్వం రుజువు చేసింది. ఏపీకి రాజధాని లేకుండా బిల్లును ఒప్పుకోవడం భాజపా చేసిన తప్పు. పార్లమెటులో నిర్ణయం చేయడం కాంగ్రెస్ చేసిన తప్పు." -కమలానంద భారతి, ఆధ్యాత్మికవేత్త
రైతుల మనోభావాలను గుర్తించి వారితో చర్చించాలి: రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే తప్ప గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని హైకోర్టు తేల్చి చెప్పిందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మూడు రాజధానులకు అవకాశం లేదని హైకోర్టు కుండబద్ధలు కొట్టిందన్నారు. ఇప్పటికే 15 వేల కోట్ల వ్యయం చేసిన రాజధానిని ఎలా ముక్కలు చేస్తారని ప్రశ్నించారు. వికేంద్రీకరణ చేయదల్చుక్కుంటే అందుకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ రాజధానిని ఎలా విడగొడతారని నిలదీశారు.
"వేల కోట్ల వ్యయం చేసిన రాజధానిని ఎలా ముక్కలు చేస్తారు. ప్రాంతాల అభివృద్ధిని ఎవరూ అడ్డుకోరు. మరో ప్రాంతం ప్రయోజనాలు దెబ్బ తీసేలా వ్యవహరించకూడదు. ఇతర నగరాలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రయత్నించాలి. రైతుల మనోభావాలను గుర్తించి వారితో చర్చించాలని కోరుతున్నాం." - ప్రొఫెసర్ కోదండరాం
ప్రభుత్వానిది కోర్టు ధిక్కరణే: రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ అన్నారు. న్యాయస్థానం తీర్పు చట్టబద్ధం, రాజ్యాంగ బద్ధంగా ఉందని తెలిపారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయకుండా.. తీర్పు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు తీసుకుని రైతులకు విశ్వాసం కల్పించి ప్రభుత్వం మారగానే దానికి భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.
"నా మాతృమూర్తి చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చారు. అమరావతిని నేను ఇప్పటివరకు నాలుగుసార్లు సందర్శించా. రాజధాని నిర్మాణం విషయంలో హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభత్వానికి కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు చెప్పినా ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు. 3 నెలలైనా తీర్పు అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణే. పాలన వికేంద్రీకరణ అంటే విశాఖ, కర్నూలు వెళ్లడం కాదు. విశాఖ, కర్నూలులో మౌలిక సదుపాయాలు కల్పించాలి." -జస్టిస్ గోపాలగౌడ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
మూడు రాజధానులు విఫలం అని తేలింది: మూడు రాజధానుల బిల్లులు, వైకాపా ప్రభుత్వం అక్రమంగా చేసిన చట్టాలను హైకోర్టులో సవాలు చేశామని సీనియర్ న్యాయవాది యు. మురళీధర్ తెలిపారు. దక్షిణాఫ్రికాకు ఉన్న మూడు రాజధానుల థియరీకి అనుగుణంగా ఇక్కడ ప్రవేశపెట్టారని.., అక్కడి మేధావులను కూడా దీనిపై సంప్రదించామన్నారు. ఆ దేశంలో మూడు రాజధానుల ప్రయోగం విఫలం అని తేలిందని.. ఆ వివరాలను కోర్టుకు సమర్పించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులు, రైతులు అంటే గౌరవం లేదని అన్నారు. రాజధానిలో పనులు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రూల్ ఆఫ్ లా ఉంటుందని.., దీనికి అంతా బద్దులై ఉండాల్సిందేనని చెప్పారు.
ఉద్యమం@900 రోజులు: రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు.. రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 900వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రముఖులు.. రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. రైతులో పోరాటం.. కోర్టు తీర్పు నేపథ్యంలో.. అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా.. ప్రభుత్వానికి ఇంకో దారి లేదని నేతలు తేల్చిచెప్పారు.
ఇవీ చూడండి
Jubleehills gang rape: రేప్ జరిగిన ఇన్నోవా కారు ఎక్కడ? అది ప్రభుత్వ వాహనమా?!